ఆ కంపెనీలకు ‘ఇంకా డిగ్రీ’లే కొలమానం!

18 Feb, 2024 14:45 IST|Sakshi

సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీలు డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులను నియమించుకుంటాయి. అయితే ఆ ధోరణికి స్వస్తి పలుకుతామని కొన్ని కంపెనీలు గతంలో వాగ్దానాలు చేశాయి. డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించాయి. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది.

బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్, లాక్‌హీడ్ మార్టిన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా అభ్యర్థులకు కళాశాల డిగ్రీలు ఉండాలనే నిబంధనను వదులుకుంటామని వాగ్దానం చేసిన కంపెనీలలో ఉన్నాయి. అయితే హార్వర్డ్ బిజినెస్ స్కూల్, బర్నింగ్ గ్లాస్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం.. వారి నియామక పద్ధతులు ఇప్పటికీ పాత ధోరణినే అనుసరిస్తున్నాయి. ఆయా కంపెనీలు ఇప్పటికీ కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి.

ఆయా కంపెనీల్లో డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియమించుకుంటామని చెప్పిన సుమారు 11,300 ఉద్యోగాలను 2014 తర్వాత నుంచి అధ్యయనం పరిశీలించింది. గత సంవత్సరం జరిగిన 700 మంది నియామకాలను పరిశీలించగా డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియమించుకున్న ఉద్యోగం ఒక్కటీ లేదని అధ్యయనం తేల్చింది.

ఈ అధ్యయనంలో కంపెనీలను మూడు వర్గాలుగా విభజించారు. వాల్‌మార్ట్, యాపిల్, టార్గెట్‌తో సహా 37 శాతం కంపెనీలు నైపుణ్యాల ఆధారిత నియామకంలో పురోగతి సాధించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్, లాక్‌హీడ్ మార్టిన్‌లతో సహా 45 శాతం కంపెనీలు డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియామకాలు చేపట్టడంలో విఫలమయ్యాయి. ఇక మూడవ వర్గం కంపెనీలను "బ్యాక్‌స్లైడర్స్" అని పిలుస్తారు. వాటిలో నైక్, ఉబెర్, డెల్టా ఉన్నాయి. నివేదికలో 18 శాతంగా ఉన్న​ ఈ కంపెనీలు నైపుణ్యాల ఆధారిత నియామకాల విషయంలో మొదట్లో పురోగతిని సాధించాయి. కానీ తర్వాత పాత పద్ధతికే వచ్చేశాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు