‘నిర్మాణ పరికరాల’ ఆదాయం 15 శాతం అప్‌

14 Oct, 2023 06:24 IST|Sakshi

2023–24పై క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా

మౌలిక, రియల్టీ, మైనింగ్‌ దన్ను

న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 14–15 శాతం మేర వృద్ధి చెందనుంది. మౌలికరంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు దోహదపడనుంది. అలాగే, రియల్‌ ఎస్టేట్, మైనింగ్‌ రంగాల్లో కార్యకలాపాలు పుంజుకోవడం కూడా తోడ్పాటు అందించనుంది. క్రిసిల్‌ రేటింగ్స్‌ ఒక నివేదికలో ఈ మేరకు అంచనా వేసింది. ‘‘గత ఆర్థిక సంవత్సరంలో అధిక బేస్‌ (29 శాతం) ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 14–15 శాతం మేర వృద్ధి చెందవచ్చు.

నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ)తో పాటు రహదారులు, మెట్రోలు, రైల్వేలు మొదలైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఇందుకు దోహదపడనుంది’’ అని క్రిసిల్‌ రేటింగ్స్‌ పేర్కొంది. సాధారణంగా నిర్మాణ పరికరాల వినియోగంలో రహదారుల వాటా 40 శాతం వరకు ఉంటుంది. రోడ్ల నిర్మాణం పనులు వేగవంతం అవుతుండటం పరిశ్రమ వృద్ధికి సహాయకరంగా ఉండనుంది.

వంతెనలు.. విమానాశ్రయాలూ..
రియల్‌ ఎస్టేట్, మైనింగ్‌ రంగాలతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, మెట్రో కారిడార్లు మొదలైన వాటి కాంట్రాక్టర్ల నుంచి తయారీ సంస్థలకు ఆర్డర్లు బాగా ఉంటున్నాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ఉపాధ్యాయ్‌ తెలిపారు. 2024 ఏప్రిల్‌ 1 నుంచి పరిశ్రమ స్టేజ్‌–వీ2 ఉద్గార ప్రమాణాలకు మళ్లనుండటం వల్ల పరికరాల ధరలు పెరగనుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పరికరాలను ముందుగానే కొంత కొని పెట్టుకునే ధోరణులు కూడా కనిపించవచ్చని వివరించారు.

పరిమాణంపరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో 1.1 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా  .. ఈ ఆర్థిక సంవత్సరం ఆల్‌ టైమ్‌ గరిష్టంగా 1.2 లక్షల యూనిట్ల స్థాయిలో విక్రయాలు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాల పరిమాణంలో ఎర్త్‌మూవింగ్‌ పరికరాల వాటా 70 శాతంగా, కాంక్రీట్‌ పరికరాల వాటా 22 శాతంగా ఉండగా.. మిగతాది మెటీరియల్‌ ప్రాసెసింగ్‌ పరికరాలది ఉన్నట్లు వివరించింది.

మరిన్ని వార్తలు