ఏకంగా 45000 కోట్లు.. డేటా సెంటర్లలోకి పెట్టుబడుల వరద

17 Nov, 2023 09:59 IST|Sakshi

ముంబై: దేశీయంగా డేటా సెంటర్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రూ. 45,000 కోట్ల మేర ఇన్వెస్ట్‌మెంట్లు రాగలవని రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో అంచనా వేసింది. పెద్ద కంపెనీలు క్లౌడ్‌ సొల్యూషన్స్‌ను వినియోగించుకోవడం పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లకు డిమాండ్‌ పెరుగుతోందని పేర్కొంది.

ఇక ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లు ప్రాచుర్యంలోకి వస్తున్న క్రమంలో రిటైల్‌ డేటా వినియోగం పెరుగుతోందని వివరించింది. గత అయిదేళ్లలో మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ వార్షికంగా 45 శాతం మేర వృద్ధి చెందిందని క్రిసిల్‌ తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ సర్వీసులతో రిటైల్‌ యూజర్లలో డేటా వినియోగం ఇంకా విస్తరిస్తుందని, తద్వారా ఉత్పత్తయ్యే డేటాను నిల్వ చేసేందుకు డేటా సెంటర్ల అవసరమూ పెరుగుతుందని వివరించింది. ప్రస్తుతం 780 మెగావాట్లుగా ఉన్న భారతీయ డేటా సెంటర్ల స్థాపిత సామర్ధ్యం .. 2026 మార్చి నాటికి 1,700 మెగావాట్ల స్థాయికి చేరగలదని, ఇందుకు రూ. 45,000 కోట్లు అవసరం కాగలవని క్రిసిల్‌ డిప్యుటీ చీఫ్‌ రేటింగ్స్‌ ఆఫీసర్‌ మనీష్‌ గుప్తా చెప్పారు.  

హైదరాబాద్, చెన్నై తదితర నగరాలకూ ప్రాధాన్యం.. 
కొత్త పెట్టుబడుల్లో దాదాపు మూడో వంతు భాగం ఆర్థిక రాజధాని ముంబైలోను, మిగతావి హైదరాబాద్, చెన్నై, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్, పుణె వంటి ప్రాంతాల్లోను ఉండవచ్చని గుప్తా చెప్పారు. సబ్‌–సీ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌ అందుబాటులో ఉండటం, బడా కంపెనీలకు నెలవుగా ఉండటం, విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా ఉండటం వంటి సానుకూల అంశాల కారణంగా ముంబైకి అత్యంత ప్రాధాన్యత లభిస్తోందని క్రిసిల్‌ వివరించింది. తాజా పెట్టుబడులన్నీ దేశీ, అంతర్జాతీయ డేటా సెంటర్‌ ఆపరేటర్లు, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలతో పాటు టెలికం, రియల్‌ ఎస్టేట్, నిర్మాణ, ఇంజినీరింగ్‌ తదితర రంగాల కంపెనీల నుంచి ఉండగలవని పేర్కొంది.    

మరిన్ని వార్తలు