మరో నెల రోజులు విదేశీ ప్రయాణాలు లేనట్టే!

31 Jul, 2020 18:18 IST|Sakshi

ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక విషయాన్ని ప్రకటించింది. ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కొనసాగుతుందని శుక్రవారం వెల్లడించింది. అయితే డీజీసీఏ ప్రత్యేక అనుమతులు ఉన్న సర్వీసులు మాత్రం కొనసాగుతాయని  తెలిపింది. అలాగే కార్గో విమానాలు, వందేమాతరం మిషన్‌లో భాగంగా నడుస్తున్న విమానాలకు ఎలాంటి అంతరాయం ఉండదని  కూడా డీజీసీఏ జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.

దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరిగిన నేపథ్యంలో, జూలై నెల ఆరంభంలో అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని జూలై 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా  ఈ నిషేధాన్ని మరింత పొడిగిస్తూ  తాజా ఆదేశాలు జారీ చేసింది. వందే భారత్ మిషన్ కింద మే 6 - జూలై 30 మధ్యకాలంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా మొత్తం 2,67,436 మందిని, ఇతర చార్టర్ల ద్వారా 4,86,811మంది ప్రయాణీకులను స్వదేశానికి తరలించినట్టు  వెల్లడించింది.  కాగా కరోనా వైరస్ మహమ్మారి  కట్టడికి గాను  విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 23న జాతీయ అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల విరామం తర్వాత మే 25న  ప్రత్యేక నిబంధనలతో దేశీయ విమాన సేవలు తిరిగి ప్రారంభమైనాయి. మరోవైపు అన్‌లాక్‌ 3.0 లో భాగంగా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

మరిన్ని వార్తలు