‘భారత్‌పే’లో నిధులు బొక్కేశారు!,మరో వివాదంలో అశ్నీర్‌ గ్రోవర్‌ దంపతులు

17 Nov, 2023 11:45 IST|Sakshi

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్‌ అశ్నీర్‌ గ్రోవర్‌, అతని భార్య మాధురి జైన్‌ గ్రోవర్‌లు మరో వివాదంలో చిక్కుకున్నారు. ది ఎకనామిక్స్‌ ఆఫెన్స్‌ వింగ్స్‌ (ఈవోడ్ల్యూ) విచారణలో ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్‌పేలో ఉండగా ఉద్యోగాల పేరిట మోసపూరిత లావాదేవీలు చేసినట్లు తేలింది. 

ఈ లావాదేవీలను భారత్‌పేలో కోచింగ్‌, డెవలప్‌మెంట్‌, రిక్రూట్‌మెంట్‌, రిసోర్స్‌ ప్లానింగ్‌ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అశ్నీర్‌ భార్య మాధూరి జైన్‌ గ్రోవర్‌ను అడ్డుపెట్టుకుని చేసినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో మాధూరి జైన్‌ కుటుంబ సభ్యుల హస్తం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

దీనిపై ఈఓడబ్ల్యూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రిక్రూట్‌మెంట్‌ వర్క్‌కు సంబంధించిన కమిషన్లు చెల్లించేందుకు నిధులు కావాలంటూ తప్పుడు తేదీలు, ఇన్వాయిస్‌లు తయారు చేసినట్లు ఆరోపిస్తుంది. అంతేకాదు భారత్‌పేలో ఉద్యోగుల్ని నియామకాల కోసం నియమించుకున్న హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీలకు రూ.7.6 కోట్లు, జీఎస్టీ సకాలంలో చెల్లించలేదని, అదనపు ఛార్జీల కింద రూ.1.6 కోట్లు, ఇతర ఫేక్‌ ట్రాన్సాక్షన్స్‌ రూ.71.76 కోట్లు ఉన్నట్లు తేలింది. ఇలా మూడు సార్లుగా చేసిన మోసపూరిత లావాదేవీలు విలువ రూ.81 కోట్లుగా ఉందని ఈఓడబ్ల్యూ విచారణలో గుర్తించింది. ఆ విచారణ ఇంకా కొనసాగుతుంది.     
 

మరిన్ని వార్తలు