ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్‌ చరిత్రలో గూగుల్‌ శకం.. అనన్య సామాన్యం

17 Dec, 2023 19:20 IST|Sakshi

Evolution Of Google: ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న సమయంలో 'గూగుల్' (Google) గురించి తెలియని వారు దాదాపు ఉండరనేది అక్షర సత్యం. ఆవకాయ వండాలన్న.. అమలాపురం గురించి తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ ఒకటే సులభమైన మార్గం గూగుల్. ఈ రోజు నభూతో నభవిష్యతిగా ఎదిగిన 'గూగుల్' రెండు దశాబ్దాల క్రితం ఓ సాదాసీదా సెర్చ్ ఇంజన్‌ మాత్రమే. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా సమాధానం అందించే జగద్గురుగా మారింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గూగుల్ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

చరిత్ర గురించి చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చదువుకున్నాం. ఇప్పుడు మాత్రం గూగుల్ పూర్వం యుగం, గూగుల్ తర్వాత యుగం అని చదువుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. దీన్ని బట్టి చూస్తే.. గూగుల్ ఎంతలా వ్యాపించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

గూగుల్ ప్రారంభం..
90వ దశకం చివరిలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటిలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో ప్రావిణ్యం కలిగిన ఇద్దరు PhD స్టూడెంట్స్ ''సెర్గీ బ్రిన్, లారీ పేజ్''లు గూగుల్ ప్రారంభించాలని నిర్విరామంగా శ్రమించి మెరుగైన సర్చ్ ఇంజిన్ కోసం ఒక నమూనాను అభివృద్ధి చేశారు. 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేసుకుని.. తోటి పీహెచ్‌డీ స్టూడెంట్ 'క్రెయిగ్ సిల్వర్‌స్టీన్‌'ను తొలి ఉద్యోగిగా చేర్చుకుని సంస్థను అధికారికంగా ప్రారంభించారు.

గూగుల్ అనే పదం ఎలా వచ్చిందంటే..
'గూగుల్' అనే పేరు 'గూగోల్' అనే పదం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గూగోల్ అనే పదానికి అర్థం ఒకటి తర్వాత వంద సున్నాలు లేదా సరైన శోధన ఫలితాలను అందించేది. ఈ పదాన్ని జేమ్స్ న్యూమాన్ అండ్ ఎడ్వర్డ్ కాస్నర్ రాసిన 'మ్యాథమెటిక్స్ అండ్ ది ఇమాజినేషన్' అనే పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

గూగుల్ ప్రస్థానం ఇలా..
1998లో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ అంచెలంచేలా ఎదుగుతూ కేవలం సెర్చ్ ఇంజన్‌గా మాత్రమే కాకుండా.. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ స్టోర్స్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ మొదలైనవి ప్రారంభించి ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసింది.

  • 1997 - గూగుల్.కామ్ డొమైన్ రిజిస్ట్రేషన్
  • 1998 - గూగుల్ అధికారికంగా ప్రారంభమైంది
  • 1999 - గూగుల్ పేజీ ర్యాంక్ డెవెలప్
  • 2000 - యాహూ భాగస్వామ్యంతో.. పెద్ద యూజర్ 'ఆర్గానిక్ సెర్చ్'గా అవతరించింది. గూగుల్ టూల్ బార్ లాంచ్. కొత్తగా 10 భాషలను జోడించింది (ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్వీడిష్, ఫిన్నిష్, స్పానిష్, పోర్చుగీస్, డచ్, నార్వేజియన్, జపనీస్, చైనీస్, కొరియన్, డానిష్).
  • 2001 - గూగుల్ తన మొదటి ఛైర్మన్ 'ఎరిక్ ష్మిత్‌'ను స్వాగతించింది. గూగుల్ ఫొటోస్ ప్రారంభమైంది.
  • 2002 - Google AdWords పరిచయం, గూగుల్ న్యూస్ మొదలైంది. గూగుల్ చరిత్రలో ఇది పెద్ద మైలురాయి.
  • 2003 - గూగుల్ AdSense ప్రారంభమైంది, దీనికి మొదట కంటెంట్ టార్గెటింగ్ అడ్వర్టైజింగ్ అని పేరు పెట్టారు.
  • 2004 - జీమెయిల్ ప్రారంభం
  • 2005 - గూగుల్ మ్యాప్స్
  • 2006 - Google YouTubeని కొనుగోలు చేస్తుంది
  • 2007 - ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ కంపెనీ అయిన డబుల్ క్లిక్‌ను గూగుల్ కొనుగోలు చేసింది
  • 2008 - గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ ప్రారంభించింది

  • 2009 - ఫోర్బ్స్ మ్యాగజైన్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్‌లను ప్రపంచంలోని ఐదవ అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పేర్కొంది
  • 2010 - గూగుల్ తన మొట్టమొదటి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ నెక్సస్ వన్‌ను విడుదల చేసింది.
  • 2011 - సీఈఓగా లారీ పేజ్‌ నియామకం, ఎరిక్ ష్మిత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. 
  • 2012 - గూగుల్ మోటరోలా మొబిలిటీని కొనుగోలు చేసింది
  • 2013 - గూగుల్ రీడర్‌ మూసివేసి.. Chromecast ప్రారంభం
  • 2014 - హమ్మింగ్ బర్డ్ ఆల్గారిథం
  • 2015 - సీఈఓగా సుందర్ పిచాయ్
  • 2016 - గూగుల్ తయారు చేసిన మొదటి ఫోన్.. గూగుల్ పిక్సెల్ లాంచ్
  • 2017 - HTCలో కొంత భాగాన్ని కొనుగోలు చేసింది
  • 2018 - మొబైల్ స్పీడ్ అల్గారిథం అప్డేట్, 20 సంవత్సరాల చరిత్రలో 100 బిలియన్ డాలర్లను అధిగమించింది
  • 2019 - బ్రాడ్ కోర్ అల్గారిథం, గూగుల్ SERPs స్టార్ట్
  • 2020 - నియామకాలను నెమ్మదించడం, మెషీన్‌లు మరియు డేటాపై ఎక్కువ దృష్టి పెట్టడం (కోవిడ్-19)
  • 2021 - ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కంటెంట్‌ను ఉపయోగించుకునే హక్కు కోసం మీడియా కంపెనీలకు Google చెల్లించాల్సిన చట్టాన్ని ప్రతిపాదించింది.
  • 2022 - క్రోమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ 
  • 2023 - గూగుల్ పిక్సెల్ 8, 8ప్రో లాంచ్, గూగుల్ జెమిని ఏఐ

1998లో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన గూగుల్.. నేడు 50 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.50 లక్షల కంటే ఎక్కువ మంది గూగుల్ సంస్థలో పనిచేస్తున్నారు. కంపెనీ నికర విలువ ప్రస్తుతం 1.675 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు అని సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 13,90,95,26,62,50,000.

గూగుల్ ఉపయోగాలు
ప్రతి ప్రశ్నకు మల్టిపుల్ సమాధానాలు అందిస్తున్న గూగుల్.. ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ప్రత్యేకంగా విద్యారంగంలో గూగుల్ పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి.

👉బ్లాగర్, యూట్యూబ్, గూగుల్ అందిస్తున్న సేవలు సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ దెబ్బకు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారిపోయింది.

👉వినోదం కోసం యూట్యూబ్ వినియోగించుకునే వారి సంగతి పక్కన పెడితే.. 10వ తరగతి చదివే ఒక విద్యార్ధి నుంచి.. IAS చదివే వ్యక్తి వరకు యూట్యూబ్ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

👉భౌతిక, రసాయనిక శాస్త్రాలు మాత్రమే కాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మీద పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా.. పాఠాలు నేర్పే గురువులకు సైతం గురువుగా మారిన గూగుల్ ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

గూగుల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది
గూగుల్ లేకపోతే ప్రపంచంలో జరిగే విషయాలు అందరికీ చేరటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ప్రజల సమూహాలు చేరినప్పుడు మాత్రమే ఇతర విషయాలను చర్చించుకోవాల్సి వచ్చేది. గూగుల్ లేకుండా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం కూడా ఉండేది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే ప్రతి ఒక్కరూ గూగుల్ ఉపయోగించాల్సిందే.

ఇదీ చదవండి: పరుగులు పెట్టిన ఈవీ రంగం.. 2023లో ఇవే హైలెట్స్

చదువుకునే వారికి కూడా అన్ని అంశాలు అందుబాటులో ఉండేవి కాదు. ఎందుకంటే గూగుల్ ప్రమేయం లేకుండా ఏదైనా తెలుసుకోవాలంటే తప్పకుండా ఉద్గ్రంధాలను (పుస్తకాలు) తిరగేయాల్సిందే. అంటే మనకు కావలసిన విషయం తెలుసుకోవడానికి రోజుల సమయం పట్టేది. మొత్తం మీద Google లేని ప్రపంచంలో జీవించడం ఇప్పుడు దాదాపు సాధ్యమనే చెప్పాలి. అంతే కాకుండా గూగుల్ లేదనే విషయాన్ని ఊహిస్తేనే చాలామందికి గుండె పోటు వచ్చేస్తుందేమో అన్నది ఓ నిజమేనేమో అనిపిస్తోందన్నది నా భావన.

>
మరిన్ని వార్తలు