పరుగులు పెట్టిన ఈవీ రంగం.. 2023లో ఇవే హైలెట్స్

16 Dec, 2023 21:18 IST|Sakshi

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. 2022తో పోలిస్తే 2023లో మార్కెట్లో విడుదలైన ఈవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి కారణం పెరిగిన ఇంధన ధరలు కావొచ్చు లేదా వాతావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం కావొచ్చు. ఏదేమైనా.. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు చూస్తున్నాయి. 

2023లో గొప్ప పురోగతి చూసిన ఎలక్ట్రిక్ వాహన రంగం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఇప్పుడే స్పష్టమవుతోంది. ఈ కథనంలో ఈవీ రంగం 2023లో ఎలాంటి పురోగతి కనపరిచింది? వాటి వివరాలు ఏంటనేది.. వివరంగా చూసేద్దాం..

బ్యాటరీ టెక్నాలజీ
1993లో భారతదేశంలో 'లవ్‌బర్డ్' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ కారు కేవలం 60 కిమీ రేంజ్ మాత్రమే అందించింది. అయితే ఈ ఏడాది దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన 'మెర్సిడెస్ బెంజ్ EQC' ఒక సింగిల్ ఛార్జ్‌తో 850 కిమీ అందిస్తోంది. దీన్ని బట్టి చూస్తే 2023లో బ్యాటరీ టెక్నాలజీ, కెపాసిటీ ఏ స్థాయిలో పెరిగిందో అర్థమైపోతుంది. అంతే కాకుండా ఛార్జింగ్ స్పీడ్, డిజైన్, ఫీచర్స్ వంటి వాటిలో కూడా ఈ ఏడాది చాలా మార్పులు సంభవించాయి.

ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగితే తప్పకుండా వాటికి కావలసిన ఛార్జింగ్ స్టేషన్స్ పెరగాలి. 2022లో కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల కొందరు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు సంబంధిత సంస్థలను ప్రోత్సహించడం జరిగింది. దీంతో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్య పెరిగింది, రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది.

టూ వీలర్స్ నుంచి పెద్ద ట్రక్కుల వరకు
ప్రారంభంలో కార్లు మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలుగా పుట్టుకొచ్చాయి. నేడు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు, పెద్ద ట్రక్కులు, బస్సులు వరకు ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. నేడు దాదాపు అన్ని విభాగాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహన రంగం విస్తరించింది.

ఈవీ రంగంలో ఏఐ ప్రవేశం
కొంతకాలం క్రితం ఎలక్ట్రిక్ కార్లలో కూడా సాధారణ కార్లలోని ఫీచర్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి, ప్రస్తుతం విడుదలవుతున్న చాలా కార్లలో ఏఐ సంబంధిత ఫీచర్స్ వస్తున్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో సహాయపడుతున్నాయి. 

ముఖ్యంగా ఏఐ అనేది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల అభివృద్ధిలో చాలా సహాయపడుతుంది. తప్పకుండా భవిష్యత్తులో మార్కెట్లో విడుదలయ్యే కార్లలో ఎక్కువ భాగం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఖచ్చితమైన నావిగేషన్, సెన్సార్ సిస్టమ్స్, డెస్టినేషన్ వంటివి ఇలాంటి కార్లలో బాగా అభివృద్ధి చెందితే ఓ కొత్త శకానికి నాందీ భూతమవుతుందని ఆశిస్తున్నాము.

>
మరిన్ని వార్తలు