విమానయానం, టెలికం ప్రాజెక్టుల పూర్తి అవశ్యం

26 Oct, 2021 04:33 IST|Sakshi

ఆర్థిక మంత్రి సీతారామన్‌ సమీక్ష

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, టెలికం శాఖ (డీఓటీ)ల్లో మూలధన వ్యయాల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయా మంత్రిత్వశాఖలను కోరారు. ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ట్వీట్‌ చేసింది. ట్వీట్‌ ప్రకారం, ఒక ఉన్నత స్థాయి సమావేశంలో మూలధన వ్యయ పురోగతి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుపై ఆర్థికమంత్రి సమీక్ష జరిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన 2021–22 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మూలధన కేటాయింపులను గణనీయంగా పెంచారు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ పెరుగదల 34.5 శాతంగా ఉంది. విలువలో రూ.5.54 లక్షల కోట్లకు చేరింది. ఈశాన్య రాష్ట్రాల్లో డిజిటల్‌ సేవల విస్తరణ వేగవంతం కావాలని కూడా టెలికంశాఖకు ఆర్థికమంత్రి సూచించారు.

మానిటైజేషన్‌ ప్రణాళికపైనా సమీక్ష...
సమావేశంలో ఆర్థికమంత్రి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ)కు సంబంధించిన ఆస్తుల మానిటైజేషన్‌ ప్రణాళికలను సమీక్షించినట్లు కూడా ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రైవేట్‌ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బృహత్తర జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎంఎన్‌పీ) కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీని కింద కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఆస్తుల మానిటైజేషన్‌ ద్వారా రూ. 6 లక్షల కోట్ల విలువను రాబట్టనుంది.

ప్యాసింజర్‌ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌ను లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్‌’ చేయాలన్నది ఈ ప్రణాళిక ఉద్దేశం. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి చెందిన 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలతో పాటు పలు రైల్వే కాలనీలతో పాటు పలు ఆస్తులు ఇందులో భాగంగా ఉండనున్నాయి. 2022–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. నేషనల్‌ ఇన్‌ఫ్రా పైప్‌లైన్‌  కార్యక్రమం కింద తలపెట్టిన ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ఇది మరో అంచె పైకి తీసుకెడుతుందని కేంద్రం పేర్కొంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు