ఆకర్షణీయమైన డిపాజిట్‌ పథకాలను ఆవిష్కరించండి

1 Jan, 2024 06:07 IST|Sakshi

నిధుల సమీకరణపై బ్యాంకులకు ఆర్థికమంత్రి సూచన  

న్యూఢిల్లీ: నిధుల సమీకరణకు బ్యాంకులు ఆకర్షణీయమైన, వినూత్న డిపాజిట్‌ పథకాలను ఆవిష్కరించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించారు. తద్వారా బ్యాంకులు తమ రుణ వృద్ధిని కూడా సాధించగలుగుతాయని అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఎండీ, సీఈఓల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మోసం, ఉద్దేశపూర్వక డిఫాల్ట్‌లకు సహకరించే అధికారులపై కఠిన పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. 

బ్యాంకింగ్‌ డిపాజిట్‌ వృద్ధి గత కొన్ని నెలలుగా క్రెడిట్‌ వృద్ధికి అనుగుణంగా లేదు.  కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినప్పటికీ క్రెడిట్‌– డిపాజిట్‌ వృద్ధి మధ్య అంతరం ఇప్పటికీ 3 నుంచి 4 శాతంగా ఉంది. ఇటీవల ఎస్‌బీఐ (అరశాతం), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (125 బేసిస్‌ పాయిట్ల వరకూ) తమ డిపాజిట్‌ రేట్లను పెంచాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెరుగైన పనితీరు పట్ల ఆర్థికమంత్రి ఈ సమావేశంలో సంతృప్తిని వ్యక్తం చేశారు.

  బ్యాంకు మోసాలు వ్యక్తిగత ఖాతాదారులకు ఆర్థిక సంస్థల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని, ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. అలాగే బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందనీ ఆమె హెచ్చరించారు. అందువల్ల ఆయా పరిణామాలు తలెత్తకుండా బ్యాంకింగ్‌ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు రూ. 68,500 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. వాణిజ్య బ్యాంకుల స్ధూల మొండిబకాయిల నిష్పత్తి 2023 మార్చి నాటికి 3.9 శాతం ఉంటే, సెపె్టంబర్‌ నాటికి 3.2 శాతానికి తగ్గాయి. ఈ సమావేశంలో నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఎఆర్‌సిఎల్‌) ఖాతాల సేకరణ పురోగతిపై కూడా చర్చ జరిగింది.

>
మరిన్ని వార్తలు