అక్టోబర్‌లో భారీగా ఉపాధి

22 Dec, 2023 05:52 IST|Sakshi

ఈపీఎఫ్‌వోలో 15.29 లక్షలు మంది నమోదు

18 శాతం వృద్ధి.. పేరోల్‌ డేటా విడుదల

న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో భారీగా ఉపాధి కల్పన నమోదైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్‌ పథకంలో 15.29 లక్షల మంది సభ్యులుగా చేరారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 18.2 శాతం మందికి అదనంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అక్టోబర్‌ నెలకు సంబంధించి పేరోల్‌ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. 7.72 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా చేరినట్టు తెలుస్తోంది.

క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు ఇందులో 6 శాతం వృద్ధి నమోదైంది. నికర సభ్యుల చేరిక 15.29 లక్షలుగా ఉంది. కొత్తగా చేరిన వారిలో 58.60 శాతం మంది 18–25 ఏళ్ల వయసులోని వారు. అంటే సంఘటిత రంగంలో వీరంతా మొదటిసారి ఉపాధి పొందిన వారని తెలుస్తోంది. ఇక 11.10 లక్షల మంది ఒక సంస్థలో మానేసి మరో సంస్థలో చేరారు. వీరు ఆన్‌లైన్‌లో తమ ఈపీఎఫ్‌లను బదిలీ చేసుకున్నారు. ఈపీఎఫ్‌వో నుంచి వైదొలగిన సభ్యుల సంఖ్య గడిచిన 12 నెలల్లోనే తక్కువగా ఉంది.

మహిళా సభ్యులు 3 లక్షలు: 7.72 లక్షల కొత్త సభ్యుల్లో 2.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్‌ నెలకు నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.03 లక్షలుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి కనిపించింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది సభ్యులు చేరారు. హోటళ్లు, టీ విక్రయ కేంద్రాలు, ట్రేడింగ్, షాపులు, కెమికల్స్‌ కంపెనీలు, జీవత బీమా సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది.

>
మరిన్ని వార్తలు