వినియోగదారులకు షాక్‌:హెచ్‌డీఎఫ్‌సీ రెండో ‘వడ్డింపు’

8 Jun, 2022 14:29 IST|Sakshi

0.35 శాతం వరకూ పెరిగిన వడ్డీరేట్లు

ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెండు నెలల వ్యవధిలో రెండో సారి రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. రుణ రేటును 0.35 బేసిస్‌ పాయింట్ల వరకూ పెంచుతున్నట్లు బ్యాంక్‌ ప్రకటన ఒకటి పేర్కొంది. దీనితో రెండు నెలల్లో పెరిగిన రేటు మొత్తం 0.60 శాతంగా ఉంది. తాజాగా పెంచిన నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) జూన్‌ 7 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్‌ ప్రకటన పేర్కొంది.

కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. 
♦ రుణాలకు ప్రధానంగా ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.50 శాతం నుంచి 7.85 శాతానికి చేరింది.  
♦ ఓవర్‌నైట్‌ ఎంసీఎల్‌ఆర్‌ 7.15 శాతం నుంచి 7.50 శాతానికి ఎగసింది.  
♦ మూడళ్ల రేటు 7.70 నుంచి 8.05కు చేరింది.  
 

ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు 
ఇదిలావుండగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెండవ ద్వైమాసిక సమావేశం కీలక నిర్ణయాలను  వెలువరించింది. గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (ప్రస్తుతం 4.4 శాతం) మరో 50  బేసిస్‌ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి ప్రధాన కారణం.  ఏప్రిల్‌లో తొలి ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్‌బీఐ ఎంపీసీ, మే తొలి వారంలో అనూహ్య రీతిలో సమావేశమై రెపో రేటును 2018 ఆగస్టు తర్వాత మొట్టమొదటిసారి 0.4 శాతం పెంచిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు