పడుతున్న పొదుపులు.. పెరుగుతున్న అప్పులు

22 Sep, 2023 04:26 IST|Sakshi

కుటుంబాల ముఖచిత్రాన్ని ఆవిష్కరించిన ఎస్‌బీఐ రీసెర్చ్‌

2020–21లో జీడీపీలో పొదుపు రేటు 11.5 శాతం

2022–23లో 5.15 శాతానికి డౌన్‌

ఇదే ఆర్థిక సంవత్సరం రూ. 8.2 లక్షల కోట్లు పెరిగిన రుణాలు

రూ. 15.6 లక్షల కోట్లకు చేరిక

విమర్శలను తోసిపుచ్చిన ఆర్థికశాఖ

ముంబై: భారత్‌లో వ్యక్తులుసహా చిన్న స్థాయి కుటుంబ సంస్థల (హౌస్‌హోల్డ్‌ సెక్టార్‌) ఆర్థిక పరిస్థితులపై ఎస్‌బీఐ రీసెర్చ్‌ కీలక అంశాలను ఆవిష్కరించింది. దీని ప్రకారం కరోనా తర్వాత వీటి పొదుపురేట్లు ఒకవైపు పడిపోతుండగా మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి. వీటి నికర ఆర్థిక (ఫైనాన్షియల్‌) పొదుపు రేటు 2022 ఏప్రిల్‌– 2023 మార్చి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.15 శాతానికి పడిపోయింది. 

గడచిన 50 సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి ఆర్థిక పొదుపురేటు నమోదు ఇదే తొలిసారి.  2020–21లో ఈ రేటు 11.5 శాతంగా  ఉంది. మహమ్మారికి ముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20) ఈ రేటు 7.6 శాతం. అటు ప్రభుత్వం, ఇటు నాన్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు (ఈపీఎఫ్‌ఓ వంటివి)  పొదుపు నిధులే ప్రధాన ఆర్థిక వనరు కావడం గమనార్హం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌస్‌హోల్డ్‌ సెక్టార్‌ రుణభారం రూ. 8.2 లక్షల కోట్లు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరుకుంది.

ప్రాథమికంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు తాజా అధికారిక విశ్లేషణ వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యక్తమైన ఆందోళనలను కేంద్ర ఆర్థికశాఖ తోసిపుచ్చడం గమనార్హం. ఫైనాన్షియల్‌ రంగంలో పొదుపు రేటు తగ్గడంపై ఆందోళన పడాల్సింది ఏమీ లేదని, వివిధ ఇతర భౌతిక పొదుపు ప్రొడక్టుల్లో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారని వివరణ ఇచ్చింది.  ఎస్‌బీఐ రీసెర్చ్‌ చెబుతున్న అంశాలు క్లుప్తంగా...

► 2022–23లో పెరిగిన  హౌస్‌హోల్డ్‌ సెక్టార్‌ రుణం రూ.8.2 లక్షల కోట్లలో బ్యాంక్‌ రుణాలు రూ.7.1 లక్షల కోట్లు. ఇందులో దాదాపు 55 శాతం భాగం గృహాలు, విద్య, వాహనాల కొనుగోళ్లకు వెళ్లింది.  
► ఈ కాలంలో బీమా, ప్రావిడెంట్‌ ఫండ్‌లు, పెన్షన్‌ ఫండ్‌ పథకాల్లో రూ. 4.1 లక్షల కోట్ల పెరుగుదల ఉంది.
► హౌస్‌హోల్డ్‌ రంగం రుణం జీడీపీ నిష్పత్తిలో చూస్తే, 2020 మార్చిలో 40.7 శాతం. 2023 జూన్‌లో ఇది 36.5 శాతానికి పడింది.  
► ఫైనాన్షియల్‌ పొదుపు నుండి తగ్గిన మొత్తంలో ప్రధాన భాగం భౌతిక (పొదుపు) ఆస్తులవైపు మళ్లింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ దీనికి కారణం.  
► సంవత్సరాలుగా హౌస్‌హోల్డ్‌ సెక్టార్‌లో 80–90 శాతం భౌతిక పొదుపులు (ఫైనాన్షియల్‌ రంగంలో కాకుండా) నివాసాలు, ఇతర భవనాలు, నిర్మాణాలు, యంత్ర పరికరాల విభాగంలో ఉన్నాయి.  
► వాస్తవానికి, 2011–2012లో హౌస్‌హోల్డ్‌ పొదుపులో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ భౌతిక ఆస్తుల వాటా ఉంది. అయితే ఇది 2020–21లో 48 శాతానికి తగ్గింది. 2022–23లో ఈ తరహా పొదుపులు మళ్లీ దాదాపు 70 శాతానికి చేరే అవకాశం కనబడుతోంది. రియల్టీ రంగం పురోగతికి ఇది సంకేతం.

నివేదిక పరిధి ఇదీ...
పొదుపులు, అప్పులకు సంబంధించి ఈ నివేదికలో ఎస్‌బీఐ రీసెర్చ్‌ ‘హౌస్‌హోల్డ్‌ సెక్టార్‌’ అని పేర్కొంది. అంటే జాతీయ ఖాతా (నేషనల్‌ అకౌంట్స్‌)కు సంబంధించి  వ్యక్తులతోపాటు, వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలు, ప్రభుత్వేతర, కార్పొరేటేతర చిన్న వ్యాపార సంస్థలు, ఏకైక (ప్రొప్రైటరీ) యాజమాన్యాలు, భాగస్వామ్యాలు, లాభాపేక్షలేని సంస్థలు వంటి అన్‌ఇన్‌కార్పొరేటెడ్‌ సంస్థలు ఈ పరిధిలో ఉంటాయి.

మరిన్ని వార్తలు