ఎకానమీ స్పీడ్‌ 5 శాతం దాటకపోవచ్చు

6 Jan, 2022 02:10 IST|Sakshi

జనవరి–మార్చి త్రైమాసికంలో ఒమిక్రాన్‌ ప్రభావంపై ఇక్రా అంచనా

0.4 శాతం వరకూ  కోత పడవచ్చని విశ్లేషణ

ముంబై: ఎకానమీపై కోవిడ్‌–19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తీవ్ర ప్రభావం తప్పదని ఇక్రా రేటింగ్స్‌ హెచ్చరించింది. నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) దీని ప్రభావం వల్ల 40 బేసిస్‌ పాయింట్లు మేర (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) కోత తప్పదని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5 శాతం శ్రేణిలోనే ఉంటుందని ఆభిప్రాయపడింది.

ఒమిక్రాన్‌ వల్ల నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.3 శాతం మేర హరించుకుపోతుందని, ఈ నేపథ్యంలో వృద్ధి రేటు 5.8–5.9 శాతం శ్రేణికి పరిమితమవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అంచనా వేసిన మరుసటి రోజే అంతకంటే తక్కువగా వృద్ధి శాతాన్ని చూపుతూ ఇక్రా విశ్లేషణ వెలువడిన విషయం గమనార్హం. కాగా మూడవ త్రైమాసికంలో (అక్టోబర్‌–డిసెంబర్‌) 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఇక్రా స్పష్టం చేసింది.

గత ఆర్థిక సంవత్సరం (2020–21) 7.4 శాతం క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో 2021–22లో మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్‌–జూన్, జూలై–సెప్టెంబర్‌) భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. ఆర్‌బీఐ ఈ అంచనాలను 9.5 శాతంగా పేర్కొనగా, వివిధ సంస్థలు 8.5 నుంచి 10 శ్రేణిలో అంచనాలను వెలువరిస్తున్నాయి. ఏజెన్సీ చీఫ్‌ ఎకనమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపిన ఇక్రా నివేదికలో కొన్ని

ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
► మూడవ వేవ్‌ ఇప్పుడే ప్రారంభమైనందున,  ఈ అంశంపై తక్షణం ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. ముందస్తు సూచనలు, కొత్త అంటువ్యాధి విస్తరణ విశ్లేషణల ఆధారంగా మున్ముందు పరిస్థితిని అంచనావేయవచ్చు. మొబిలిటీ ఆంక్షల వల్ల ముఖ్యంగా కాంటాక్ట్‌ ప్రాతిపదికన ఉపాధి రంగాల్లో  ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే వీలుంది.  
► ఇప్పటికి 2021–22లో 9 శాతం వృద్ధి అంచనాలనే కొనసాగిస్తున్నాం. మూడవ వేవ్‌ ప్రభావంపై డేటా పూర్తిగా అందుబాటులో లేకపోవడం, డిసెంబర్‌లో ప్రభుత్వ వ్యయాల గణాంకాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉండడం వంటి అంశాలు దీనికి కారణం.  
► కేంద్రం గత నెల్లో రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయ ప్రణాళికలను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు ఎంత మేర పెరిగితే అంతమేర మూడవవేవ్‌ ప్రభావం తగ్గుతుంది. దీనికితోడు మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వాలు, కుటుంబాల సంసిద్ధత, ఆరోగ్య వ్యవస్థ పటిష్టత వంటి అంశాలూ ఇక్కడ కీలకమైనవి. అయితే ఆయా అంశాల్లో ఇంకా తీవ్ర అనిశ్చితి నెలకొంది.  
► సరఫరాల కొరత తగ్గడం, పండుగల సీజన్‌ వంటి అంశాల నేపథ్యంలో మూడవ త్రైమాసికం (అక్టోబర్‌–డిసెంబర్‌)లో వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 6 నుంచి 6.5 శ్రేణిలో కొనసాగిస్తున్నాం.  
► ఇటీవలి కోవిడ్‌–19 కేసుల పెరుగుదల,  అనిశ్చితికి దారితీసే అంశాల నేపథ్యంలో ‘ద్రవ్యోల్బణం తీవ్ర ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉంటే తప్ప’ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన సరళతర విధానాన్ని ఇప్పుడే విడనాడకపోవచ్చు. ఫిబ్రవరిలో జరిగే వరుస 10వ ద్వైమాసిక సమావేశాల్లోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4శాతం) ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించే వీలుంది.  

మరిన్ని వార్తలు