మార్కెట్‌ అస్థిరతలను తట్టుకోవడం ఎలా?

6 Jun, 2022 08:29 IST|Sakshi

మార్కెట్లు తీవ్ర అస్థిరతలు ఎదుర్కొంటున్నాయి.. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా?– శ్రవణ్‌ 
మార్కెట్లలో ఇప్పుడు అస్థితరలు ఎదుర్కొంటున్నది నిజం. ఇప్పుడనే కాదు గతంలోనూ అస్థిరతలను చూశాం. భవిష్యత్తులో ఈ ఆటుపోట్లు మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈక్విటీలంటేనే అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని (ఈఎఫ్‌) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్‌ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్‌ రూపంలో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు నిజంగా సంతోషాన్నివ్వాలి. ఎందుకంటే ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్‌ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే నానా రకాల సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్‌ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది.

ఎవరైనా ఒకరు ఆలస్యంగా 35 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే.. అప్పటి వరకు నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసేది ఎలా? నేను 55 ఏళ్లకే రిటైర్‌ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి నిధిని సిద్ధం చేసుకోవడం ఎలా? – సురేష్‌ 
మరీ అంత ఆలస్యం ఏమీ కాలేదు. మీ రిటైర్మెంట్‌కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్‌ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు 20–25 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం సరిపోతుంది. అంతేకాదు, మీరు అనుకున్న 55 ఏళ్లకు రిటైర్‌ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్‌ లేదని గుర్తు పెట్టుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడుల మొత్తం తీసుకెళ్లి డెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన విధానం కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు కొంత భాగం అలానే కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. కనుక వెంటనే ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు మంచి ఫ్లెక్సీక్యాప్‌ (ఫోకస్డ్‌) ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మ్యాజిక్‌ సాధ్యపడుతుందన్నది ఇన్వెస్టర్లు నమ్మే అంశం. అది జరగాలంటే మరింత పెట్టుబడి పెట్టాలన్నది గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్‌ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధిగా అది ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే మార్గం.  

చదవండి: విద్యా రుణం.. అన్నీ ఆలోచించాకే..!

మరిన్ని వార్తలు