కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతుల్లో క్షీణత

28 Sep, 2023 05:34 IST|Sakshi

 2023–24లో 22 శాతం క్షీణించొచ్చు

అమెరికా, యూరప్‌లో డిమాండ్‌ బలహీనం

ఇక్రా నివేదిక అంచనా

ముంబై: కట్, పాలిష్డ్‌ వజ్రాల (సీపీడీ) ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22 శాతం తగ్గి 17.2 బిలియన్‌ డాలర్లుగా (రూ.1.42 లక్షల కోట్లు) ఉండొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, యూరప్‌ వంటి కీలక వినియోగ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ప్రభావంతో డిమాండ్‌ తగ్గిన  విషయాన్ని ప్రస్తావించింది. ‘‘2022–23 ద్వితీయ ఆరు నెలల నుంచి సీపీడీల ఎగుమతులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి.

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో చూసినా (ఏప్రిల్‌–ఆగస్ట్‌) ఎగుమతులు 31 శాతం తక్కువగా నమోదయ్యాయి’’ అని ఇక్రా నివేదిక వెల్లడించింది. పండుగల సీజన్‌ నేపథ్యంలో రానున్న నెలల్లో ఎగుమతులు సీక్వెన్షియల్‌గా (క్రితం నెలతో పోలి్చనప్పుడు) పెరగొచ్చని పేర్కొంది. మొత్తం మీద పూర్తి ఆర్థిక సంవత్సరానికి 22 శాతం తక్కువగా నమోదు అవుతాయని తెలిపింది.

ఈ రంగం అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగెటివ్‌కు మార్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా డైమండ్ల డిమాండ్‌లో చైనా వాటా 10–15 శాతంగా ఉంటుంది. చైనా మార్కెట్‌లో ఈ డిమాండ్‌ ఇంకా చెప్పుకోతగినంతగా పుంజుకోలేదు‘‘అని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ సాక్షి సునేజా తెలిపారు. సహజ వజ్రాలతో పోలిస్తే ల్యాబ్‌లో తయారైన వజ్రాలు చాలా తక్కువ ధరలో లభిస్తుండడం కూడా అధిక పోటీకి కారణమవుతున్నట్టు చెప్పారు.  

గరిష్ట స్థాయిలో ముడి వజ్రాల ధరలు
ముడి వజ్రాల ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయిలోనే కొనసాగుతాయని ఇక్రా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత ధరలు 15 ఏళ్ల మధ్యస్థ స్థాయిలో ఉన్నాయని తెలిపింది. కరోనా తర్వాత ఒక్కసారిగా పెరిగిన డిమాండ్, మైనింగ్‌ కంపెనీల నుంచి సరఫరా తగ్గడం వల్లే గడిచిన రెండేళ్ల కాలంలో ధరలు పెరగడానికి దారితీసినట్టు వివరించింది.

ప్రస్తుతం డిమాండ్‌ తగ్గినప్పటికీ రష్యా నుంచి ముడి వజ్రాల సరఫరా తగ్గడంతో ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నట్టు పేర్కొంది. రష్యాకు చెందిన అల్రోసా పీజేఎస్‌సీ మైనింగ్‌ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేసింది. అదే సమయంలో ఇతర మైనింగ్‌ సంస్థల నుంచి అదనపు సరఫరా రాకపోవడం ధరలకు రెక్కలు వచి్చనట్టు వివరించింది. పాలిష్డ్‌ వజ్రాల ధరలపై ఒత్తిడి ఉన్నట్టు తెలిపింది. 15 ఏళ్ల మధ్యస్థ స్థాయి కంటే 15–20 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపింది. దీనికి తోడు డిమాండ్‌పై ఒత్తిళ్లు,
కస్టమర్లకు ధరల పెంపును బదిలీ చేసే సామర్థ్యం తక్కువగా ఉండడంతో, వజ్రాల కంపెనీల లాభాల మార్జిన్లు 0.4 శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేసింది. నిల్వలు కూడా పెరుగుతాయని పేర్కొంది.   

ఎగుమతిదారులకు వెసులుబాటు
2024 జూన్‌ వరకూ ఆర్‌ఓడీటీఈపీ స్కీమ్‌ వర్తింపు  
ఎగుమతిదారుల ప్రయోజనాలకు ఉద్దేశించిన ఆర్‌ఓడీటీఈపీ స్కీమ్‌ (స్కీమ్‌ ఫర్‌ రెమిషన్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ అండ్‌ ట్యాక్సెస్‌ ఆన్‌ ఎక్స్‌పోర్టెడ్‌ ప్రొడక్ట్స్‌) పథకాన్ని 2024 జూన్‌ వరకూ పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 సెపె్టంబర్‌ నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఈ నెలతో ముగియనుంది. ప్రస్తుతం, 10,342 పైగా ఎగుమతి వస్తువులు ఈ పథక ప్రయోజనాల కిందకు వస్తున్నాయి.  ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన పథకం ఇది. వస్తువుల తయారీ– పంపిణీ ప్రక్రియలో ఎగుమతిదారులు చెల్లించే పన్నులు, సుంకాలు, లెవీల వాపసు కోసం ఉద్దేశించినది. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ఎగుమతిదారులకు కేంద్రం తాజా నిర్ణయం ఊరటనివ్వనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు