జీఐఐ టాప్‌ 50 దేశాల్లో భార‌త్‌కు 48వ స్థానం

3 Sep, 2020 08:13 IST|Sakshi

న్యూఢిల్లీ : నవకల్పన(ఇన్నోవేష‌న్)లకు సంబంధించి టాప్‌ 50 దేశాల జాబితాలో భారత్‌ తొలిసారి స్థానం దక్కించుకుంది. నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిల్చింది. 2020 సంవత్సరానికిగాను ప్రపంచ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో), కార్నెల్‌ యూనివర్సిటీ, ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌ సంయుక్తంగా విడుదల చేసిన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ (జీఐఐ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నవకల్పనల్లో టాప్‌ దేశాలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ క్రమంగా చైనా, భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి ఆసియా దేశాల స్థానాలు మెరుగుపడుతున్నాయని డబ్ల్యూఐపీవో పేర్కొంది. వివిధ అంశాల ప్రాతిపదికన చూస్తే నవకల్పనలకు సంబంధించి దిగువ మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. (ఇక వచ్చే ఏడాదే జీడీపీ ‘వెలుగు’)

ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, సర్వీసుల ఎగుమతులు, ప్రభుత్వ ఆన్‌లైన్‌ సర్వీసులు వంటి విభాగాల్లో టాప్‌ 15 దేశాల్లో చోటు దక్కించుకుంది. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు నాణ్యమైన ఆవిష్కరణలకు తోడ్పడుతున్నాయని డబ్ల్యూఐపీవో తెలిపింది. జీఐఐ టాప్‌ 5 దేశాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. జీఐఐ కోసం 131 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేశారు. విద్యా సంస్థలు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ తదితర అంశాల ప్రాతిపదికన ర్యాంకింగ్‌ ఇచ్చారు. (ఆర్థిక వృద్ధికి ఎయిర్‌పోర్టుల ఊతం)

మరిన్ని వార్తలు