భారత్‌కు క్యూ కడుతున్న సంస్థలు.. గ్లోబుల్‌ కేపబులిటి సెంటర్ల జోరు!

22 Nov, 2023 11:17 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్యకలాపాల సామర్థ్య కేంద్రాలు (జీసీసీలు) భారత్‌లో 2025 నాటికి 1,900కు చేరుకుంటాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా తెలిపింది. మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో (కార్యాలయ స్థలం) వీటి వాటా 35–40 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో 1,580 జీసీసీలు ఉన్నట్టు తెలిపింది. బహుళజాతి సంస్థల కార్యకలాపాలకు వేదికగా ఉండే వాటిని జీసీసీలుగా చెబుతారు. 

భారత్‌ ఆకర్షణీయం
భారత్‌ కాకుండా బ్రెజిల్, చైనా, చిలే, చెక్‌ రిపబ్లిక్, హంగరీ, ఫిలిప్పీన్స్, పోలాండ్‌ సైతం జీసీసీ కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అయితే, లీజు వ్యయాల పరంగా, నైపుణ్య మానవ వనరుల పరంగా భారత్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉంటూ, జీసీసీలకు ప్రాధాన్య కేంద్రంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్య కాలంలో భారత్‌లో జీసీసీల విస్తరణ దూకుడుగా ఉందని, ఆరు పట్టణాల్లో మొత్తం ఆఫీస్‌ లీజులో వీటి వాటా 38 శాతానికి చేరుకుందని తెలిపింది. 

ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలల్లో జీసీసీల ఆఫీసు లీజు పరిమాణం 9.8 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉన్నట్టు వెల్లడించింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ జీసీసీ ఆఫీస్‌ లీజులో 77 శాతం వాటాను (జనవరి–జూన్‌ మధ్య) ఆక్రమిస్తున్నట్టు పేర్కొంది. ‘‘జీసీసీలకు భారత్‌ అత్యంత ప్రాధాన్య కేంద్రంగా మారింది. నైపుణ్య మానవ వనరులు, తక్కువ వ్యయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ మద్దతుకు జీసీసీల వృద్ధి సాక్షీభూతంగా నిలుస్తుంది’’అని సీబీఆర్‌ఈ భారత్, ఆగ్నేయాసియా చైర్మన్, సీఈవో అన్షుమన్‌ మేగజిన్‌ పేర్కొన్నారు. 

ద్వితీయ శ్రేణీ పట్టణాల్లోనూ..
చిన్న, మధ్య స్థాయి బహుళజాతి సంస్థలు సైతం క్రమంగా భారత్‌లోకి అడుగుపెడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ జీసీసీల ఏర్పాటు ద్వారా విస్తరణకు ఆసక్తి చూపిస్తున్నట్టు పేర్కొంది.    

మరిన్ని వార్తలు