ధరలు అదుపు.. పరిశ్రమల పరుగు!

13 Oct, 2023 00:34 IST|Sakshi

ఎకానమీకి సానుకూల గణాంకాలు

సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5%

మూడు నెలల కనిష్ట స్థాయి 

ఆగస్టులో పారిశ్రామిక వృద్ధి 10.3%

14 నెలల గరిష్టానికి హైజంప్‌  

న్యూఢిల్లీ: భారత్‌ తాజా ఆర్థిక గణాంకాలు పూర్తి ఊరటనిచ్చాయి. అధికారికంగా విడుదలైన సమాచారం ప్రకారం,  ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ పాలసీ సమీక్షా నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.02 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి.

ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్బణం మైనస్‌ 2 లేదా ప్లస్‌ 2తో 6 శాతం వద్ద ఉండాలి. అయితే తమ లక్ష్యం 4 శాతమేనని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఇటీవలి తన పాలసీ సమీక్ష సందర్భంగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక పారిశ్రామిక రంగ వృద్ధికి సంబంధించిన సూచీ (ఐఐపీ) ఆగస్టులో 10.3 శాతం వృద్ధిని చూసింది. గడచిన 14 నెలల్లో ఈ స్థాయి వృద్ధి రేటు ఎన్నడూ నమోదుకాలేదు. 2023–24లో సగటును 5.4 శాతం ద్రవ్యోల్బణం ఉంటుందన్నది ఆర్‌బీఐ అంచనా.  

రిటైల్‌ ధరల తీరు చూస్తే... 
ఒక్క ఆహార ధరల విషయానికి వస్తే, రెండంకెల్లో (గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చి) ధరలు పెరిగిన వస్తువుల్లో తృణధాన్యాలు (10.95 శాతం), పప్పులు (16.38 శాతం), సుగంధ ద్రవ్యాలు (23.06 శాతం) ఉన్నాయి. మాంసం, చేపలు (4.11 శాతం), గుడ్లు (6.42 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (6.89 శాతం), పండ్లు (7.30 శాతం), కూరగాయలు (3.39 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తులు (4.52 శాతం), నాన్‌–ఆల్కాహాలిక్‌ బేవరేజెస్‌ (3.54 శాతం), ప్రెపేర్డ్‌ మీల్స్, స్నాక్స్, స్వీట్స్‌ (4.96 శాతం), ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ (6.30 శాతం) ఉత్పత్తులో పెరుగుదల రేటు ఒకంకెకు పరిమితమైంది. కాగా, ఆయిల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ధరలు పెరక్కపోగా 14.04% తగ్గడం గమనార్హం.  

రంగాల వారీగా పారిశ్రామిక ఉత్పత్తి పురోగతి  
ఆగస్టు నెలల్లో తయారీ రంగం 9.3 శాతం పురోగతి  (2022 ఆగస్టు నెలతో పోల్చి) సాధించింది. విద్యుత్‌ రంగం 15.3 శాతం, మైనింగ్‌ 12.3%, భారీ పెట్టుబడులకు, యంత్ర సామాగ్రి కొనుగోళ్లకు ప్రతిబింబంగా ఉండే క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో 12.6 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే  రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌కండీషర్లకు సంబంధించి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో మాత్రం వృద్ధిలేకపోగా 5.7 శాతం క్షీణత నెలకొంది. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్‌ నాన్‌– డ్యూరబుల్స్‌ రంగంలో మాత్రం వృద్ధి రేటు 9 శాతంగా ఉంది. 

మరిన్ని వార్తలు