ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్‌..?

31 Jan, 2024 13:02 IST|Sakshi

భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధి 2024-25లో 7 శాతంకు చేరుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. మధ్యంతర కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రకటించిన నివేదికలో ఇందుకు సంబంధించి కీలక అంశాలను పేర్కొంది. 2030 నాటికి ఇండియా 7 శాతం వృద్ధిని అధిగమించగలదని, ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. రానున్న మూడేళ్లలో భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు పేర్కొంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచం కేవలం 2 శాతం వృద్ధి సాధించబోతుందని, కానీ భారత్‌ రానున్న రోజుల్లో 7 శాతం వృద్ధి సాధించబోతున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీన్ని ఎకనామక్‌సర్వేగా భావించకూడదని నాగేశ్వరన్ స్పష్టం చేశారు.

ఆర్థికనివేదిక ప్రకారం భారతదేశ వృద్ధిని రెండు దశలుగా విభజించారు. 1950 నుంచి 2014 వరకు ఒకదశ. 2014-2024 వరకు రెండో దశగా పరిగణించారు. 2012-13, 2013-14 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడినట్లు నివేదిక చెప్పింది. దాంతో జీడీపీ 5 శాతం కంటే తక్కువ వృద్ధి నమోదు చేసినట్లు తెలిసింది. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు.. వంటి అంశాలు గతంలో వృద్ధి క్షీణించేందుకు కారణాలుగా మారినట్లు నివేదికలో వెల్లడించారు.

ఇదీ చదవండి: బడ్జెట్‌ 2024-25 కథనాల కోసం క్లిక్‌ చేయండి

మినీ ఎకనామిక్ సర్వేగా పరిగణించిన ఈ నివేదిక అన్ని సానుకూల పరిణామాలు, సవాళ్లను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారత్ వచ్చే మూడేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిసింది. 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది.

whatsapp channel

మరిన్ని వార్తలు