వ్యాక్సిన్ : ఇన్ఫీ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు

12 Aug, 2020 10:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కరోనా మహమ్మారి, ఆర్థికసంక్షోభంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో దేశ జీడీపీ కనిష్ట స్థాయికి పడిపోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాల రీత్యా స్వాతంత్రం సాధించిన 1947 నాటి కనిష్ట స్థాయికి  దేశ జీడీపీ పడిపోనుందంటూ తాజాగా హెచ్చరించారు. అంతేకాదు జీడీపీ గణాంకాలు నెగిటివ్ వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ఇందుకు అన్ని రంగాలు సిద్దంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

భారతదేశ జీడీపీ కనీసం ఐదు శాతం తగ్గిపోతుందని, 1947నాటి కంటే కనిష్టానికి చేరుకోనుందనే ఆందోళనను నారాయణ మూర్తి వ్యక్తం చేశారు. ''లీడింగ్ ఇండియా డిజిటల్ రివల్యూషన్ ''16వ ఎడిషన్ చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం క్షీణించింది. జీడీపీ పడిపోతోంది. అంతర్జాతీయ ప్రయాణాలు దాదాపు కనుమరుగయ్యాయి. ఫలితంగా జీడీపీ 5 నుంచి 10 శాతం క్షీణించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రతీ రంగానికి చెందిన వారు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉంటూ కొత్త వ్యవస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు గ్రామాలకు తరలి పోయిన 140 మిలియన్ల మంది వలస కార్మికులను తిరిగి పని ప్రదేశాలకు తీసుకురావాలని  నారాయణ మూర్తి సూచించారు. (లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన)

దేశంలోకి ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. రోజుకు కోటి మందికి  వ్యాక్సిన్ ఇచ్చినా భారతీయులందరికీ టీకాలు వేయడానికి 140 రోజులు పడుతుంది. అప్పటి వరకూ ప్రజలు వైరస్ తో సహజీవనానికి సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు మాస్క్ లు ధరిస్తూ, భౌతిక దూరాన్నిపాటించడం ముఖ్యమన్నారు. అలాగే ప్రభుత్వాలు ఆసుపత్రి పడకల సంఖ్యను పెంచడం, పరీక్షల సామర్ధ్యాన్ని పెంచడం లాంటి చర్యలు చేపట్టడం చాలా అవసరమని పేర్కొన్నారు. కరోనావైరస్ కారణంగా తన బంధువు ఒకరు మరణించడాన్ని ప్రస్తావించిన ఆయన టైర్ 2,3 పట్టణాలలో సౌకర్యాల కొరతపై మండిపడ్డారు. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు