తెలుగు రాష్ట్రాల్లో భారీ ఇథనాల్‌ కేంద్రాలు

25 Feb, 2021 00:03 IST|Sakshi
రామకుమార్, ఆర్‌ఎస్‌ఎస్‌ రావు (కుడి)  

ఏర్పాటు చేయనున్న ఇండియన్‌ ఆయిల్‌ 

ఒక్కో ఫెసిలిటీకి రూ.600 కోట్ల వ్యయం

సాక్షి, హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగంలో ఉన్న ఆయిల్, గ్యాస్‌ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌.. ప్రత్యామ్నాయ ఇంధనం కోసం భారీ ఇథనాల్‌ ఉత్పత్తి కేంద్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఒక్కో ఫెసిలిటీకి రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌వీ రామకుమార్‌ తెలిపారు. కంపెనీ ఈడీ, తెలంగాణ, ఏపీ హెడ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ రావుతో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒక్కో కేంద్రం రోజుకు 5 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రెండు స్థలాలను ప్రతిపాదించింది. ఏపీ సైతం ఇదే స్థాయిలో స్పందిస్తుందన్న ధీమా ఉంది. స్థలం చేతిలోకి రాగానే 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం’ అని చెప్పారు. 

బ్యాటరీ ప్లాంటు.. 
ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల తయారీ కోసం ఇజ్రాయెల్‌ కంపెనీ ఫినెర్జీతో ఇండియన్‌ ఆయిల్‌ ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒక గిగావాట్‌ వార్షిక సామర్థ్యంతో రానున్న ప్రతిపాదిత ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేసేది త్వరలో ప్రకటించనున్నారు. అల్యూమినియం ఆధారిత బ్యాటరీలను ఇక్కడ తయారు చేస్తారు. ఒకసారి చార్జీ చేస్తే ఈ బ్యాటరీతో 400 కిలోమీటర్ల వరకు వాహనం ప్రయాణిస్తుంది. బ్యాటరీలకు కావాల్సిన ముడి పదార్థాలన్నీ దేశీయంగా లభించేవే. రెండవ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఇండియన్‌ ఆయిల్‌ నోయిడాలో నెలకొల్పనుంది. 2023 జూలై నాటికి ఇది సిద్ధం కానుంది. ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,300 కోట్లు వెచ్చించనుంది. 

సుపీరియర్‌ డీజిల్‌ త్వరలో.. 
ఇండియన్‌ ఆయిల్‌ త్వరలో సుపీరియర్‌ డీజిల్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, చట్టబద్ధమైన అనుమతులు సైతం పొందామని రామకుమార్‌ తెలిపారు. ధర ఎక్కువ ఉన్నప్పటికీ కస్టమర్లకు ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పారు. ఇంజన్‌ శుభ్రంగా ఉండడం, తక్కువ ఉద్గారాలు, అధిక మైలేజీ ఇస్తుందని వివరించారు.  

ఎనర్జీ స్టేషన్స్‌గా అవతరణ.. 
సంస్థ ఫ్యూయల్‌ స్టేషన్స్‌ రూపురేఖలు మారనున్నాయి. 5–10 ఏళ్లలో ఇండియన్‌ ఆయిల్‌ పంపుల్లో మిథనాల్, ఇథనాల్, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ సైతం విక్రయించనున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ పాయింట్లూ రానున్నాయి. సాధారణ ఫ్యూయల్‌ స్టేషన్స్‌ కాస్తా ఇండియన్‌ ఆయిల్‌ ఎనర్జీ స్టేషన్స్‌గా రూపొందనున్నాయి. అలాగే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 5,000 కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ కేంద్రాలు రానున్నాయి. ఇప్పటికే 600 కేంద్రాలకు అనుమతులు ఇచ్చారు. ఒక ఎకరం స్థలం, రూ.3–5 కోట్ల పెట్టుబడి పెట్టగలిగే ఔత్సాహికులు ముందుకు రావొచ్చు. రుణమూ దొరుకుతుంది. కేజీకి సంస్థ రూ.46 చెల్లిస్తుంది.

మరిన్ని వార్తలు