ఇక ట్రైన్ జర్నీలోనూ స్విగ్గీ ఫుడ్ డెలివరీ

5 Mar, 2024 16:13 IST|Sakshi

స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌తో నచ్చిన ఆహారాన్ని.. ఉన్న చోటుకే తెప్పించుకుని తినేస్తున్నాం. ఈ డెలివరీ సర్వీసులు దాదాపు నగరాలకే పరిమితమయినప్పటికీ, స్విగ్గీ మాత్రం 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (IRCTC)తో ఒప్పందం కుదుర్చుకుని మరో అడుగు ముందు వేసింది.

స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ అండ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం ఇకపైన రైళ్లలో ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడానికి స్విగ్గీ సన్నద్ధమైంది. ఈ సర్వీస్ మార్చి 12 నుంచి ప్రారంభమవుతుంది.

ప్రారంభంలో స్విగ్గీ ఈ సర్వీసును బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న రోజుల్లో 59 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసును విస్తరించనున్నట్లు సమాచారం.

రైళ్లలో ప్రయాణించే సమయంలో నచ్చిన ఫుడ్​ను ప్రీ-ఆర్డర్​ చేయడానికి ముందుగా ఐఆర్​సీటీసీ యాప్‌లో పీఎన్​ఆర్​ నెంబర్ ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. తర్వాత తాము ఏ స్టేషన్​లో అయితే ఆహారాన్ని రిసీవ్​ చేసుకోవాలనుకుంటున్నారా.. ఆ రైల్వే స్టేషన్​ను సెలెక్ట్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలా చేసుకున్న తరువాత మీకు మీరు ఎంచుకున్న ఫుడ్​ను స్విగ్గీ డెలివరీ బాయ్స్​ తీసుకొచ్చి డెలివర్​ చేస్తారు.

స్విగ్గీతో ఏర్పడ్డ ఈ భాగస్వామ్యం ప్రయాణీకులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని, వారు కోరుకునే ఆహరం ఎంపిక చేసుకునే అవకాశం ఇందులో లభిస్తుందని, ఇది వారి ప్రయాణాన్ని మరింత సంతోషంగా మార్చడంలో ఉపయోగపడుతుందని IRCTC ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ అన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు