డెయిరీ రంగంలోకి ‘కైన్‌’

30 Oct, 2020 06:33 IST|Sakshi
కైన్‌ ఉత్పత్తులతో రంగయ్య, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కంపెనీ ఈడీ శరద్‌ (ఎడమ నుంచి)

 వికారాబాద్‌లో ఉమెనోవా అగ్రో ఫుడ్‌ పార్క్‌

ప్లాంటు కోసం రూ.200 కోట్ల పెట్టుబడి

సాక్షితో కంపెనీ సీఈవో రంగయ్య శెట్లం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డెయిరీ రంగంలోకి కొత్త బ్రాండ్‌ ‘కైన్‌’ రంగ ప్రవేశం చేసింది. ఉమెనోవా డెయిరీ ప్రమోట్‌ చేస్తున్న ఈ బ్రాండ్‌లో ప్రస్తుతం టెట్రా ప్యాక్‌లో పోషకాలతో కూడిన పాలను విక్రయిస్తున్నారు. కొద్ది రోజుల్లో కుర్కుమిన్, హనీ వేరియంట్లను అందుబాటులోకి తెస్తారు. 2021 జూన్‌ నాటికి నెయ్యి, పెరుగు, వెన్న, పనీర్‌ వంటి 15 రకాల ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో కంపెనీ టెట్రా ప్యాక్‌ పాలను విక్రయిస్తోంది. లీటరు ప్యాక్‌ ధర రూ.65 ఉంది. ఉమెనోవా డెయిరీకి చైర్‌పర్సన్‌గా పడిగల లీలావతి వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కైన్‌ ఉత్పత్తులను గురువారం ఆవిష్కరించారు.  

అత్యాధునిక మిషనరీతో..
ఉమెనోవా డెయిరీ మాతృ సంస్థ ఉమెనోవా అగ్రో ఫుడ్‌ పార్క్‌ వికారాబాద్‌ జిల్లాలో 16.5 ఎకరాల్లో ప్లాంటును నిర్మిస్తోంది. డెన్మార్క్, యూఎస్‌ నుంచి తీసుకొచ్చిన అత్యాధునిక మెషినరీని వాడుతున్నారు. మొత్తం సుమారు రూ.200 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు సంస్థ సీఈవో రంగయ్య వి శెట్లం సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘2021 జూన్‌ నాటికి ప్లాంటు పూర్తిగా సిద్ధం కానుంది. రోజుకు లక్ష లీటర్ల పాలను ప్రాసెస్‌ చేయగలదు. సుమారు 200 మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు.  

పేపర్‌ ప్యాకింగ్‌లో..: భారత్‌లో తొలిసారిగా గేబుల్‌ టాప్‌ ప్యాకింగ్‌లో తాజా పాలను తేనున్నట్టు రంగయ్య వెల్లడించారు. ‘పూర్తిగా పేపర్‌తో ప్యాకింగ్‌ ఉంటుంది. ఏడు రోజులపాటు పాలు నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాల మాదిరిగానే ధర ఉంటుంది. యూఎస్, జర్మనీ మెషినరీని తెప్పిస్తున్నాం’ అని తెలిపారు. ఒమన్‌లో 25 ఏళ్లుగా డెయిరీ, బెవరేజెస్‌ రంగంలో జాకీ ఫుడ్స్‌ పేరుతో కంపెనీని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా