మాక్రోటెక్‌ డెవలపర్స్‌కు రూ.933 కోట్ల నష్టం  

3 Nov, 2022 14:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (లోధా బ్రాండ్‌) సెప్టెంబర్‌ త్రైమాసికానికి రూ.933 కోట్ల కన్సాలిడేటెడ్‌ నష్టాన్ని ప్రకటించింది. తన బ్రిటిష్‌ అనుబంధ కంపెనీకి ఇచ్చిన రుణానికి సంబంధించి రూ.1,177 కోట్లు కేటాయింపులు చేయాల్సి రావడమే ఈ నష్టాలకు దారితీసినట్టు సంస్థ వెల్లడించింది.

అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.223 కోట్లుగా ఉండడం గమనించాలి. రుణానికి కేటాయింపులు, ఫారెక్స్‌ ప్రభావాలను పక్కన పెట్టి చూస్తే నికర లాభం 28 శాతం పెరిగి రూ.367 కోట్లుగా ఉంటుందని మాక్రోటెక్‌ డెవలపర్స్‌ వివరించింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో క్షీణించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,137 కోట్ల నుంచి రూ.1,761 కోట్లకు పరిమితమైంది.

బ్రిటన్‌లో ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గాను లోధా డెవలపర్స్‌ యూకేకు గ్రూపు రుణాలు ఇవ్వాల్సి వచ్చినట్టు సంస్థ పేర్కొంది. ప్రస్తుతమున్న భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం తదితర పరిస్థితులు తమ రుణాలపై ప్రభావం చూపించినట్టు వివరించింది. ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది.  

మరిన్ని వార్తలు