త్వరలో మోంట్రా ఈ–వాహనాలు

12 Jul, 2022 06:29 IST|Sakshi

చెన్నై: మోంట్రా బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలు, ట్రాక్టర్లు రెండు నెలల్లో భారత మార్కెట్లో రంగ ప్రవేశం చేయనున్నాయి. మురుగప్ప గ్రూప్‌ కంపెనీ అయిన ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆఫ్‌ ఇండియాకు (టీఐఐ) చెందిన టీఐ క్లీన్‌ మొబిలిటీ మోంట్రా బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం రూ.200 కోట్లు వెచ్చించనున్నట్టు టీఐఐ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అరుణ్‌ మురుగప్పన్‌ వెల్లడించారు. ‘కంపెనీ త్రిచక్ర వాహనాలు మార్కెట్లో సంచలనం సృష్టించనున్నాయి. ఇవి విలక్షణమైన, ఉన్నతమైన పనితీరు కలిగి ఉంటాయి. వినియోగదార్లు లక్ష్యంగా అధునాతన సాంకేతికతతో రూపొందుతున్నాయి.

పర్యావరణ అనుకూల ఉత్పత్తులతో జీవన ప్రమాణాలను మరింత మెరుగుపర్చడం మా ధ్యేయం. ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహన విపణి 2025 నాటికి 1.7 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. అంతర్జాతీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాల్లో ఒకటిగా నిలవనుంది. తొలి ఏడాది చెన్నై ప్లాంటులో 75,000 యూనిట్ల త్రిచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తాం. ప్రయాణికులు, సరుకు రావాణాకు అవసరమైన వాహనాలను రూపొందిస్తాం. దేశవ్యాప్తంగా 40 కేంద్రాల్లో పంపిణీ వ్యవస్థ ఉంది. దీనిని డిసెంబర్‌కల్లా 100కు చేరుస్తాం. ఇతర విభాగాల్లోకి ప్రవేశిస్తాం. ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్ల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ సెలెస్ట్రియల్‌ను కొనుగోలు చేశాం. చెన్రై వెలుపల సెలెస్ట్రియల్‌ ట్రాక్టర్స్‌ కొత్త ప్లాంటును స్థాపిస్తోంది’ అని వివరించారు.

మరిన్ని వార్తలు