మంత్రికి క్షమాపణలు చెప్పిన మస్క్‌.. కారణం ఇదేనా..

14 Nov, 2023 16:47 IST|Sakshi

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌మస్క్‌కు చెందిన దిగ్గజ సంస్థ టెస్లా ప్లాంట్‌ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం సందర్శించారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లోని ఈ  కేంద్రంలో విద్యుత్ కార్ల తయారీని మంత్రి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. అయితే మంత్రి వెంట టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ కనిపించలేదు. దీనిపై ఎక్స్‌ వేదికగా మంత్రికి మస్క్‌ క్షమాపణలు చెప్పారు.

మంత్రి తన సందర్శనను ఉద్దేశించి ఎక్స్‌ ఖాతాలో ఇలా పోస్ట్‌ చేశారు. ‘కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లో ఉన్న టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించాను. ఇక్కడ సీనియర్ హోదాలో పనిచేస్తోన్న భారత ఇంజినీర్లు, ఆర్థిక నిపుణులను కలవడం ఆనందంగా ఉంది. టెస్లా ప్రయాణంలో వారు అందిస్తోన్న సహకారం గర్వకారణం. టెస్లా తయారీలో ఇండియా నుంచి దిగుమతులు పెంచడం సంతోషంగా ఉంది. ఈ పర్యటనలో మస్క్‌ను మిస్‌ అవుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలి’ అని మంత్రి అన్నారు. 

మంత్రి ట్వీట్‌పై మస్క్‌ స్పందించారు. ‘మీరు టెస్లాను సందర్శిచడం మాకు గొప్ప గౌరవం. ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. త్వరలో మీతో జరగబోయే భేటీకి ఎదురుచూస్తున్నాను’ అని టెక్‌ దిగ్గజం పోస్ట్‌ చేశారు.

టెస్లా విద్యుత్‌ కార్లు త్వరలోనే భారత్‌లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో జరిగిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎలాన్‌ మస్క్‌ సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. ఈవీ వాహనాల తయారీకోసం దేశంలోని కొన్ని నిబంధనలు సడలించనున్నట్లు సమాచారం. తాజా పర్యటనలో గోయల్‌-మస్క్‌ భేటీ జరుగుతుందని, భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు, దేశీయంగా పరికరాల కొనుగోలు, ఛార్జింగ్‌ మౌలిక వసతుల ఏర్పాటు, సుంకాల గురించి ప్రధానంగా చర్చిస్తారని వార్తలు వచ్చాయి. అయితే మస్క్‌ అనారోగ్యంతో ఈ భేటీ సాధ్యం కాలేదు.

మరిన్ని వార్తలు