ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 25% క్షీణత

11 Aug, 2020 01:25 IST|Sakshi

అటో పరిశ్రమను వీడని కరోనా సంక్షోభం 

జూలై గణాంకాలను విడుదల చేసిన ఎఫ్‌ఏడీఏ

అటో పరిశ్రమను కరోనా సంక్షోభం వెంటాడుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు భారీగా క్షీణించాయి. ఈ జూలైలో ప్యాసింజర్‌ వాహనాల రిటైల్‌ అమ్మకాలు 1,57,373 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది(2019)లో ఇదే జూన్‌లో అమ్ముడైన 2,10,377 యూనిట్లతో పోలిస్తే 25శాతం తక్కువని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. కరోనా ఎఫెక్ట్‌ జూలైలోనూ కొనసాగడం వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఎఫ్‌ఏడీఏ చెప్పుకొచ్చింది.   

ద్విచక్ర వాహన అమ్మకాలు జూలైలో 37.47శాతం క్షీణించి 8,74,638 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే జూలైలో మొత్తం అమ్మకాలు 13,98,702 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన అమ్మకాలు ఏకంగా 72.18శాతం పడిపోయి 19,293 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే జూలైలో త్రిచక్ర వాహనాల విక్రయాలు క్షీణతను చవిచూశాయి. గతేడాది జూలైలో పోలిస్తే అమ్మకాలు 74.33శాతం పతనమై 15,132 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని విభాగాలు కలిపి మొత్తం అమ్మకాలు 11,42,633 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 17,92,879 యూనిట్లతో పోలిస్తే 36.27శాతం తగ్గదల చోటుచేసుకుంది.

వాహన విక్రయాలపై ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ ఆశిష్‌ హర్షరాజ్‌ కాలే మాట్లాడుతూ ‘‘జూన్‌తో పోలిస్తే జూలైలో రిటైల్‌ వాహన అమ్మకాలు ఊపందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన పరిశీలిస్తే విక్రయాలు సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు వాస్తవ డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి. గతేడాది జూలైలో లోబేస్‌ ఉన్నప్పటికీ అమ్మకాలు డబుల్‌ డిజిట్‌ క్షీణతను చవిచూశాయి’’ అన్నారు.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారమైన వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్, చిన్న వాణిజ్య వాహనాలు, మోటర్‌ సైకిల్‌ విభాగాల్లో అమ్మకాల వృద్ధి కొనసాగిందని ఖేల్‌ తెలిపారు. డిమాండ్‌ను పెంచే విధివిధానాలను ప్రకటించాలని ఎఫ్‌ఏడీఏ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తుందన్నారు. ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్‌ విధానం కోసం పరిశ్రమ ఆత్రంగా ఎదురుచూస్తోందని ఇది మధ్య, భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలకు గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అటో తయారీ హబ్స్‌లో లాక్‌డౌన్‌ విధింపు లేకపోతే అగస్ట్‌ అమ్మకాలు ఆశాజనకంగా ఉండొచ్చని కాలే అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు