ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ పసిడి రుణాలపై ఆర్‌బీఐ నిషేధం

5 Mar, 2024 04:20 IST|Sakshi

ముంబై: పర్యవేక్షణ లోపాల కారణంగా ఆర్థిక సేవల సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ బంగారం రుణాలు ఇవ్వకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వచి్చనట్లు ఆర్‌బీఐ తెలిపింది. అయితే, ప్రస్తుత గోల్డ్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియోకి సంబంధించిన వసూళ్లు, రికవరీ ప్రక్రియలను యథావిధిగా కొనసాగించవచ్చని పేర్కొంది.

పసిడి రుణాలిచ్చేటప్పుడు, డిఫాల్ట్‌ అయిన సందర్భాల్లో వేలం వేసేటప్పుడు బంగారం స్వచ్ఛత, బరువును విలువ కట్టడంలో లోపాలు, పరిమితికి మించి నగదు రూపంలో రుణ మొత్తాన్ని మంజూరు చేయడం .. వసూలు చేయడం తదితర తీవ్ర ఉల్లంఘనలను కంపెనీ ఆడిట్‌లో గుర్తించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వివరించింది. అలాగే, ప్రామాణిక వేలం ప్రక్రియలను పాటించకపోవడం, కస్టమర్లకు విధించే చార్జీలపై పారదర్శకత లోపించడం మొదలైనవి కూడా కస్టమర్ల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపేవేనని ఆర్‌బీఐ తెలిపింది. సంస్థపై చేపట్టిన ప్రత్యేక ఆడిట్‌ పూర్తయ్యాక పర్యవేక్షణపరమైన ఆంక్షలను సమీక్షించనున్నట్లు వివరించింది.

whatsapp channel

మరిన్ని వార్తలు