సచిన్‌కు రూ.27 కోట్ల లాభం.. ఎలా అంటే?

29 Dec, 2023 08:35 IST|Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ గాడ్ 'సచిన్ టెండూల్కర్' (Sachin Tendulkar) హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఆజాద్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌లో పెట్టిన పెట్టుబడులు గురువారం భారీ వృద్ధిని సాధించడంతో ఏకంగా రూ.27 కోట్లు సంపాదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆజాద్ ఇంజినీరింగ్‌లో సచిన్ 2023 మార్చిలో రూ.5 కోట్లు ఇన్వెస్ట్ చేసి రూ. 114.10 ప్రైజ్​ పాయింట్​లో 4,38,210 షేర్లు కొనుగోలు చేశారు. వాటి విలువ నిన్న (డిసెంబర్ 28) ఏకంగా 7 రెట్లు పెరిగి స్టాక్ వ్యాల్యూ రూ. 720కి చేరింది. దీంతో షేర్స్ విలువ సుమారు రూ.32 కోట్లకు చేరాయి.

సచిన్ టెండూల్కర్ మాత్రమే కాకుండా.. ఆజాద్ ఇంజినీరింగ్‌లో బ్యాడ్మింటన్​ స్టార్ సైనా నెహ్వాల్, పీవీ సింధు, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, నిఖిత్ జరీన్ కూడా పెట్టుబడులు పెట్టారు, ఇందులో వారికి కూడా వాటాలున్నాయి.

ఆజాద్‌ ఇంజినీరింగ్‌ సంస్థ రక్షణ, ఏరోస్పేస్‌, ఇంధన, చమురు పరిశ్రమలకు చెందిన కంపెనీలకు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. అంతే కాకుండా మిట్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్‌, సీమెన్స్‌ ఎనర్జీ, హనీవెల్‌ ఇంటర్నేషనల్‌, జనరల్‌ ఎలక్ట్రిక్‌, ఈటన్‌ ఏరోస్పేస్‌, ఎంఏఎన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ వంటి ప్రముఖ కంపెనీలు ఆజాద్‌ ఇంజినీరింగ్‌కు వినియోగదారులుగా ఉన్నట్లు సమాచారం.

మిచెల్ కంటే ఎక్కువ
ఆజాద్ ఇంజినీరింగ్‌లో ఒకే సారి రూ. 27 కోట్లు రావడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ఆస్ట్రేలియా పేసర్ 'మిచెల్ స్టార్క్‌'ను మించిపోయాడు. డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్2024 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మిచెల్‌ను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పోలిస్తే సచిన్​కు వచ్చిన లాభాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు