14 సంవత్సరాల కృషి.. నిజమవుతున్న ఎగిరే కారు కల - వీడియో

14 Nov, 2023 19:42 IST|Sakshi

ఇప్పటివరకు డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్ అంటూ గత కొన్ని రోజులుగా చాలా కంపెనీలు చెబుతూనే ఉన్నాయి. కొన్ని సంస్థలు చెప్పినట్లుగానే ఎగిరే కార్లను విడుదల చేసే పనిలో ఉంటే. మరి కొన్ని సైలెంట్‌గా ఉన్నాయి. అయితే 'సామ్సన్ స్కై' (Samson Sky) కంపెనీ ఎట్టకేలకు ఓ ఫ్లైయింగ్ కారుని తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వాషింగ్టన్‌లోని మోసెస్ లేక్‌లోని గ్రాంట్ కంట్రీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 'సామ్సన్ స్విచ్‌బ్లేడ్' (Samson Switchblade) ఆకాశానికి ఎగిరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది దాదాపు ఆరు నిముషాలు 500 అడుగులు ఎత్తులో ఎగిరింది.

సుమారు 14 సంవత్సరాల తరువాత కంపెనీ తన మొదటి ఫ్లైయింగ్ కారు తయారైందని సంస్థ సీఈఓ, స్విచ్‌బ్లేడ్ రూపకర్త 'సామ్ బౌస్‌ఫీల్డ్' తెలిపాడు. ఇప్పటికే సుమారు 57 దేశాల నుంచి 170000 డాలర్ల అంచనా ధరతో 2300 రిజర్వేషన్స్ తీసుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.

రెండు సీట్లు కలిగిన ఈ ఫ్లైయింగ్ కారు స్ట్రీట్ మోడ్‌లో గంటకు 200 కిమీ, ఫ్లైట్ మోడ్‌లో 322 కిమీ/గం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదని కంపెనీ ధ్రువీకరించింది. ఈ కారులోని వింగ్స్, టెయిల్ వంటివి పార్కింగ్స్ సమయంలో ముడుచుకుని ఉంటాయి. కాబట్టి పార్కింగ్ కోసం ఎక్కువ స్థలం కేటాయించాల్సిన అవసరం లేదు.

ఇదీ చదవండి: రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్‌

సామ్సన్ స్విచ్‌బ్లేడ్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 125 లీటర్లు వరకు ఉంటుంది. కాబట్టి ఒక ఫుల్ ట్యాంక్‌లో 805కిమీ పరిధిని అందిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ కారు ఎప్పుడు అధికారికంగా మార్కెట్లో విడుదలవుతుందనే సమాచారం కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.

మరిన్ని వార్తలు