నేడు నేలచూపులతో  మార్కెట్లు?!

21 Sep, 2020 08:28 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 42 పాయింట్లు మైనస్‌

నిఫ్టీకి 11,439-11,374 వద్ద సపోర్ట్స్‌

యూఎస్‌ మార్కెట్లు 0.8-1.2 శాతం డౌన్‌

ప్రస్తుతం అటూఇటుగా ఆసియా మార్కెట్లు

శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు

నేడు(21న) దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 42 పాయింట్లు క్షీణించి 11,478 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ 11,520 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్‌ దిగ్గజాలలో అమ్మకాలతో వరుసగా మూడో రోజు శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. గురువారం(24న) సెప్టెంబర్‌ డెరివేటివ్ సిరీస్‌ ముగియనున్న కారణంగా దేశీ మార్కెట్లు నేడు ఆటుపోట్ల మధ్య ట్రేడ్‌కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

రెండో రోజూ డీలా
శుక్రవారం తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివర్లో డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 114 పాయింట్లు క్షీణించి 38,846 వద్ద స్థిరపడగా..  నిఫ్టీ 11 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,505 వద్ద ముగిసింది. తొలుత సెన్సెక్స్‌ 39,200 వద్ద గరిష్టాన్ని తాకగా.. చివర్లో  38,636 పాయింట్ల దిగువకు సైతం చేరింది. ఇక ఇంట్రాడేలో నిఫ్టీ 11,584- 11,446  పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,439 పాయింట్ల వద్ద, తదుపరి 11,374 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,577 పాయింట్ల వద్ద, ఆపై 11,650 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,721 పాయింట్ల వద్ద, తదుపరి 21,411 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,406 పాయింట్ల వద్ద, తదుపరి 22,780 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.

స్వల్ప కొనుగోళ్లు..
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 205 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 101 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 250 కోట్లు, డీఐఐలు రూ. 1,068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా