సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

3 Nov, 2023 15:53 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే వరకు నిఫ్టీ 97 పాయింట్లు లాభాపడి 19230 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 282 పాయింట్లు పుంజుకుని 64363 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.28 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టైటాన్‌, జేఎస్‌డబ్ల్యూ, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌ స్టాక్‌లు లాభాల్లో పయనించాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటాస్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, నెస్లే, ఎన్‌టీపీసీలు నష్టాల్లో ముగిశాయి.

యూఎస్‌ ఫెడ్‌ ఛైర్మన్‌ గతంలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందనే సూచనలు చేస్తూ వ్యాఖ్యనించారు. దాంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. అనంతరం అమెరికా బాండ్ల రాబడులు 10ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. కానీ బుధవారం రాత్రి జెరొమ్‌పావెల్‌ ఇకపై వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని తెలపడంతో మార్కెట్‌ పుంజుకుంది. దాంతో అమెరికాలో ప్రభుత్వ బాండ్ల రాబడులు దిగొచ్చిన నేపథ్యంలో అక్కడి మార్కెట్లు గురువారం రాణించాయి. ఐరోపా సూచీలు సైతం లాభాల్లోనే స్థిరపడ్డాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ కీలక వడ్డీ రేటును 15 ఏళ్ల గరిష్ఠమైన 5.25 శాతం వద్ద ఉంచింది. నేడు ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లూ సానుకూలంగా ట్రేడయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం రూ.1,261.19 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను అమ్మారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,380.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

మరిన్ని వార్తలు