టాటా మోటార్స్‌ సరికొత్త రికార్డు.. ఎప్పుడూ లేనంతగా.. 

13 Dec, 2023 11:01 IST|Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ 2023 నవంబర్‌లో గరిష్ట విక్రయాలను నమోదు చేసింది. పండుగల సీజన్‌ నేపథ్యంలో స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్‌ ఇందుకు కారణమని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర తెలిపారు. ‘గత నెలలో దేశవ్యాప్తంగా కంపెనీ 53,000 యూనిట్లను విక్రయించింది.

ఈ సంఖ్య అంత క్రితం నెలతో పోలిస్తే 8 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 30 శాతం అధికం. 2023 నవంబర్‌ నెలలో నమోదైన విక్రయాలు ఇప్పటి వరకు కంపెనీ చరిత్రలోనే అత్యధికం. ఇక 47 రోజుల పండుగల సీజన్‌లో 79,374 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 పండుగల సీజన్‌తో పోలిస్తే ఇది 18 శాతం అధికం. కొత్తగా విడుదలైన నూతన నెక్సన్, హ్యారియర్, సఫారీ మోడళ్లతోపాటు ఐ–సీఎన్‌జీ శ్రేణి ఈ జోరుకు కారణం’ అని చెప్పారు.  

డీజిల్‌ స్థానంలో సీఎన్‌జీ.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ వెహికిల్స్‌ పరిశ్రమతోపాటు టాటా మోటార్స్‌ సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చనుందని శైలేష్‌ చంద్ర అన్నారు. ‘2023–24లో అన్ని కంపెనీలవి కలిపి 40 లక్షల యూనిట్ల మార్కును దాటవచ్చు. నవంబర్‌ రిటైల్‌ విక్రయాల్లో టాటా మోటార్స్‌ వాటా 15 శాతం దాటింది. ఎస్‌యూవీల్లో నెక్సన్, పంచ్‌ గత నెలలో టాప్‌–2లో ఉన్నాయి. ఎస్‌యూవీ మార్కెట్లో టాటా రెండవ స్థానంలో నిలిచింది. ప్యాసింజర్‌ వెహికిల్స్‌ రంగం నెలకు 3.3–3.5 లక్షల యూనిట్లను నమోదు చేస్తుంది.

చిన్న హ్యాచ్‌బ్యాక్స్, సెడాన్స్‌లో డీజిల్‌ మోడళ్లు కనుమరుగయ్యాయి. డీజిల్‌ స్థానంలో సీఎన్‌జీ వచ్చి చేరింది. ఈ విభాగాల్లో సీఎన్‌జీ ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచింది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీకి పైన డీజిల్‌ మోడళ్లకు బలమైన డిమాండ్‌ ఉంది. కాబట్టి మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకుంటాం’ అని వివరించారు.

>
మరిన్ని వార్తలు