మెప్పించిన టెక్‌ మహీంద్రా

30 Jul, 2021 00:21 IST|Sakshi

జూన్‌ త్రైమాసికంలో లాభం 43 శాతం అప్‌

రూ.1,366 కోట్లకు చేరిక

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయమైన పనితీరును ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం 43 శాతం వృద్ధి చెంది రూ.1,366 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.956 కోట్లతో పోల్చినా లేక ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభం రూ.1,206 కోట్లతో చూసినా వృద్ధి చెందింది. లాభాల్లో మార్జిన్‌ 15.3 శాతానికి విస్తరించడం వల్ల పన్నుకు ముందస్తు లాభంలో 39 శాతం వృద్ధి నమోదైంది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం 10 శాతం పెరిగి రూ.10,485 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా ఆదాయం (మార్చి క్వార్టర్‌తో పోలిస్తే) 10 శాతం వృద్ధిని చూపించింది. డాలర్‌ మారకంలో చూస్తే నికర లాభం 42 శాతానికి పైగా వృద్ధితో 183.2 మిలియన్‌ డాలర్లుగాను, ఆదాయం 14.6 శాతం వృద్ధితో 1,383 మిలియన్‌ డాలర్లుగాను ఉన్నాయి.

కంపెనీ ఉద్యోగులు సీక్వెన్షియల్‌గా (మార్చి త్రైమాసికంతో పోల్చినప్పుడు) జూన్‌ క్వార్టర్‌లో 5,209 మంది పెరిగారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,26,263కు చేరింది. సుమారు 13,544 కోట్లు (183 మిలియన్‌ డాలర్లు) నగదు, నగదు సమాన నిల్వలున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభాన్ని జూన్‌ క్వార్టర్‌లో నమోదు చేసినట్టు సీఎఫ్‌వో మిలింద్‌ కుల్‌కర్ణి తెలిపారు. 815 మిలియన్‌ డాలర్ల (రూ.6 వేల కోట్లకు పైగా) విలువైన నూతన వ్యాపార ఒప్పందాలను సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరును సాధించినట్టు చెప్పా రు. డిజిటల్‌పై పెరుగుతున్న వ్యయాలను అవకాశాలుగా మలుచుకుని రానున్న కాలంలో ఇదే వృద్ధిని లేదంటే ఇంతకుమించి మెరుగైన పనితీరును నమోదు చేస్తామన్న ఆశాభావాన్ని కంపెనీ ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు