యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం ప్లస్‌

26 Oct, 2023 04:51 IST|Sakshi

క్యూ2లో రూ. 5,864 కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్‌(క్యూ2)లో నికర లాభం 10 శాతం బలపడి రూ. 5,864 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది.

గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 5,330 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 24,094 కోట్ల నుంచి రూ. 31,660 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం వృద్ధితో రూ. 12,315 కోట్లకు చేరింది.ప్రపంచ భౌగోళిక, రాజకీయ ఆటుపోట్ల మధ్య భారత్‌ వృద్ధి బాటలోనే సాగుతున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో అమితాబ్‌ చౌదరీ పేర్కొన్నారు.

ఎన్‌పీఏలు డౌన్‌
ప్రస్తుత సమీక్షా కాలంలో యాక్సిస్‌ బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్లు 0.15% మెరుగై 4.11 శాతాన్ని తాకాయి. త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.96% నుంచి రూ. 1.73 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.41 % నుంచి 0.36 శాతానికి వెనకడుగు వేశాయి.  

ఫలితాల నేపథ్యంలో ఈ షేరు బీఎస్‌ఈలో 1% నీరసించి రూ. 955 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు