ఆ క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌తో వారికి ఎలాంటి సంబంధం లేదు: డాబర్‌ గ్రూప్‌

15 Nov, 2023 19:40 IST|Sakshi

క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌లో తమకు ఎటువంటి పాత్ర లేదని డాబర్‌ గ్రూప్‌నకు చెందిన బర్మన్‌ కుటుంబం స్పష్టం చేసింది. ఇటీవల మహదేవ్‌ క్రికెట్‌ బెట్టింగ్‌యాప్‌తో డాబర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ మోహిత్‌ బర్మన్‌, గ్రూప్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ బర్మన్‌ పేర్లు వినిపించాయి. దాంతో పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమచారం. అయితే వివాదంపై డాబర్‌గ్రూప్‌ స్పందించింది. రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను తాము కొనుగోలు చేయకుండా అడ్డుకోవడం కోసం కావాలనే ఈ ఫిర్యాదు నమోదుచేశారని పేర్కొంది.

నవంబరు 7న నమోదైనట్లు చెబుతున్న ఆ ఎఫ్‌ఐఆర్‌లో యాప్‌ ప్రమోటరు మహదేవ్‌తో పాటు 32 మందిపై ఫిర్యాదు చేసినట్లు ఉంది. అందులో డాబర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ మోహిత్‌ బర్మన్‌, గ్రూప్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ బర్మన్‌ పేర్లున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో మోహిత్‌, గౌరవ్‌లకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని ఆరోపించారు. వారెవరూ మోహిత్‌, గౌరవ్‌లకు తెలియదని గ్రూప్‌ సభ్యులు తెలిపారు. బర్మన్‌ కుటుంబానికి రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో 21.24 శాతం వాటా ఉంది. అయితే ఆ వాటాను పెంచుకోవాలని భావిస్తున్న సమయంలో ఈ ఎఫ్‌ఐఆర్‌ వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి: రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి: ఇన్ఫోసిస్ మూర్తి

బర్మన్స్‌ గ్రూప్‌ రెలిగేర్‌కు రూ.2,200 కోట్ల ఒపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. కానీ, ఓపెన్‌ ఆఫర్‌ చేయడానికి ఆ గ్రూప్‌నకు అర్హత లేదంటూ రెలిగేర్‌ స్వతంత్ర డైరెక్టర్లు నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ వంటి నియంత్రణ సంస్థలు సూచించిన అన్ని అర్హతలూ తమకున్నాయని బర్మన్స్‌ పేర్కొన్నారు. అదే సమయంలో 2018 నుంచి రెలిగేర్‌ ఛైర్‌పర్సన్‌ రశ్మీ సలూజా పారితోషికం రూ.150 కోట్లకు పెరగడంపైనా బర్మన్స్‌ ప్రశ్నలు లేవనెత్తగా.. సలూజా వాటిని తోసిపుచ్చారు. ఓపెన్‌ ఆఫర్‌ విషయాన్ని అనధికారికంగా సలూజాకు తెలియపరచిన తదుపరి రోజే సలూజా తన షేర్లను విక్రయించడంపైనా బర్మన్స్‌ ఆరోపణలు చేశారు.

మరిన్ని వార్తలు