‘మాంద్యం’లోకి జారిన అమెరికా!

29 Jul, 2022 02:15 IST|Sakshi

జూన్‌ క్వార్టర్‌లో 0.9 శాతం క్షీణత

వాషింగ్టన్‌: అమెరికా జూన్‌ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిలేకపోగా 0.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అగ్రరాజ్య జీడీపీ క్షీణతలో ఉండడం వరుసగా ఇది రెండవ త్రైమాసికం. మార్చి త్రైమాసికంలో ఎకానమీ 1.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. వరుసగా రెండు త్రైమాసికాలు ఎకానమీ క్షీణ బాటలో ఉంటే దానిని అనధికారికంగా (సాంకేతికంగా) మాంద్యంగానే పరిగణిస్తారు. తాజా పరిస్థితిని క్షీణతగా ఎంతమాత్రం భావించరాదని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ పేర్కొంటున్నారు.

ఎకానమీలో పలు రంగాలు పటిష్టంగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను క్షీణతలోకి జారిందని పేర్కొనడం సరికాదన్నది వారి వాదన. తీవ్ర ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి పరిణామాల నేపథ్యంలో రుణ వ్యయాలు పెరిగిపోయి అమెరికా వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ‘మాంద్యం’ అంటే ఏమిటన్న ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణ అదుపునకు జనవరి మొదలు ఇప్పటివరకూ  వడ్డీ రేటును ఫెడ్‌ 2.25 శాతం పెంచింది. దీనితో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 2.25 –2.5 శాతానికి చేరాయి. అయితే ఇకపై రేటు పెంపులో దూకుడు ఉండకపోవచ్చని అంచనా. 

మరిన్ని వార్తలు