ఎన్నికలవేళ ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై ఉత్కంఠ!

13 Mar, 2024 13:21 IST|Sakshi

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2020 నుంచి పెండింగులో ఉన్న భూక్రమబద్ధీకరణను మార్చి 31లోగా అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ఆదేశించారు. ఓ పక్క ప్రభుత్వ గడువు ముంచుకొస్తుంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ అమలవుతుందా? లేదా? అని ప్రజల్లో చర్చలు మొదలవుతున్నాయి. 

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ త్వరలో విడుదల చేయనుందని తెలుస్తుంది. ఒకసారి నోటిఫికేషన్‌ వచ్చాక పథకాన్ని అమలు చేయడంపై పలు సందేహాలు వస్తున్నాయి. సుమారు 25.44 లక్షల దరఖాస్తులను అధికారులు పరిష్కరించాల్సి ఉంది. వీటిపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వ్యాజ్యాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేపట్టి.. ప్రభుత్వామోదం కోసం పత్రాలను సైతం పంపినట్లు తెలిసింది. 

రెండు దశల్లోనే తనిఖీ ప్రక్రియ..

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం పెట్టిన దరఖాస్తులను తనిఖీ చేసేందుకు ముందుగా మూడు దశలను ఖరారు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించటం ఒకటి. అర్హమైనదా.. కాదా.. నిర్ధారించి నోటీసులు జారీ చేయటం రెండో దశ, అర్హమైన వాటికి మూడో దశలో దరఖాస్తులను ఆమోదించడం. అయితే మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు తక్కువగా ఉండటంతో దరఖాస్తుల తనిఖీ ప్రక్రియను రెండు దశల్లోనే పూర్తి చేయాలని నిశ్చయించారు.

ఇదీ చదవండి: మొత్తం కేంద్రానికే.. రాష్ట్రాలు గగ్గోలు!

క్షేత్రస్థాయి తనిఖీ పూర్తి చేసి అర్హమైనదా? కాదా? అన్న నోటీసులతో పాటు చెల్లించాల్సిన మొత్తం వివరాలతో నోటీసు జారీ ప్రక్రియ అంతటినీ ఒకే దశలో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. అర్హత పొందిన దరఖాస్తుదారులు నిర్ధారిత మొత్తాన్ని చెల్లించిన మీదట ఆమోదించే ప్రక్రియను రెండో దశలో పూర్తి చేయాలని నిర్ణయించారు.

Election 2024

మరిన్ని వార్తలు