ఈయన్ని నమ్మి స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? | Sakshi
Sakshi News home page

‘1000శాతం రిటర్నులు పక్కా’ అంటూ ప్రచారం..12 కోట్లు చెల్లించాలంటూ ఫిన్‌ఫ్లూయెన్సర్‌కు సెబీ షాక్‌

Published Sun, Apr 7 2024 4:29 PM

Sebi Order On Financial Influencer Ravindra Balu Bharti - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ (ఫిన్‌ఫ్లూయెన్సర్) రవీంద్ర బాలుకు సెబీ భారీ షాకిచ్చింది. స్టాక్‌ మార్కెట్‌ పేరుతో అక్రమంగా సంపాదించిన మొత్తం రూ.12 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది 

 ఇటీవల కాలంలో స్టాక్‌ మార్కెట్‌లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందచ్చనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని నమ్మి పలువురు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతున్నారు. ఇదే అంశంపై మార్కెట్‌ నియంత్రణ మండలి  ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మార్కెట్‌ రెగ్యులేటర్‌ నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలు, వ్యక్తులపై సెబీ కొరడా ఝుళిపిస్తోంది. 

ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ (RBEIPL)వ్యవస్థాపకుడు రవీంద్ర బాలుకు సెబీ నోటీసులు అందించింది. రవీంద్రబాలు,తన భార్య శుభాంగి భారతితో కలిసి 2016 నుంచి భారతి షేర్‌ మార్కెట్‌ పేరుతో వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. అందులో స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, మార్కెట్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలిపేలా మదుపర్లకు క్లాసులు ఇస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఈ వెబ్‌సైట్‌ ద్వారా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం నుంచి 1000 శాతం వరకు లాభాలు గడించవచ్చనే ప్రచారం చేస్తున్నారు. 

ఈ ప్రచారంపై సమాచారం అందుకున్న సెబీ రవీంద్ర బాలుకు సంబంధించిన అన్నీ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి నోటీసు వచ్చే వరకు పెట్టుబడి సలహా సేవలు, ట్రేడింగ్ కార్యకలాపాలలో పాల్గొనొద్దంటూ సెబీ వారిని నిషేధించింది. 

దీంతో పాటు నేషనల్‌ బ్యాంక్‌లో ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో రూ.12 కోట్లను డిపాజిట్‌ చేయాలని సూచించింది.కాగా, రెగ్యులేటరీ బాడీ నుండి స్పష్టమైన అనుమతి లేకుండా వాటిని విడుదల చేయడం సాధ్యం కాదని నిర్ధారిస్తూ, ఈ ఎస్క్రో ఖాతాలో నిధుల్ని సెబీ సంరక్షణలో ఉంటాయి.

Advertisement
Advertisement