డెట్‌ ఫండ్స్‌ నుంచి ఉపసంహరణలు

25 Sep, 2023 06:35 IST|Sakshi

ఆగస్ట్‌లో రూ.25,872 కోట్లు వెనక్కి

లిక్విడ్, లో డ్యురేషన్‌ ఫండ్స్‌లో అమ్మకాలు

న్యూఢిల్లీ: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆగస్ట్‌ నెలలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. జూలై నెలలో నికర పెట్టుబడులను ఈ విభాగం ఆకర్షించగా.. ఆగస్ట్‌లో రూ.25,872 కోట్లు వీటి నుంచి బయటకు వెళ్లిపోయాయి. అమెరికాలో ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ఇంకా ముగియకపోవడంతో ఇన్వెస్టర్లు డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల పట్ల అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డెట్‌లో 16 విభాగాలకు గాను 9 విభాగాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లిక్విడ్‌ ఫండ్స్‌ (రూ.26,824 కోట్లు), అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ (రూ.4,123 కోట్లు)లో ఎక్కువగా అమ్మకాలు నమోదయ్యాయి. ఇవన్నీ స్వల్పకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించిన పథకాలు. అలాగే, బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ విభాగం సైతం నికరంగా రూ.985 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ఇక ఓవర్‌ నైట్‌ ఫండ్స్‌ రూ.3,158 కోట్లు, ఫ్లోటర్‌ ఫండ్స్‌ రూ.2,325 కోట్లు, కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ రూ.1,755 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ఈ ఏడాది జూలైలో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రూ.61,140 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.
ఈక్విటీల్లోకి పెట్టుబడులు..  
‘‘ప్రస్తుత వడ్డీ రేట్ల వాతావరణం, వడ్డీ రేట్ల గమనంపై నెలకొన్న అనిశి్చతితో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. వడ్డీ రేట్ల గమనంపై స్పష్టత వచ్చే వరకు వేచి ఉండే ధోరణి అనుసరించినట్టుగా ఉంది. అదే సమయంలో ఈక్విటీల్లో ర్యాలీ మొదలు కావడంతో డెట్‌ నుంచి పెట్టుబడులను అటువైపు మళ్లించినట్టున్నారు’’అని మారి్నంగ్‌ స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ మెలి్వన్‌ శాంటారియా వివరించారు. తాజా అమ్మకాలతో ఆగస్ట్‌ చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని డెట్‌ ఫండ్స్‌ పెట్టుబడుల విలువ రూ.14 లక్షల కోట్లకు పరిమితమైంది. జూలై చివరికి ఇది రూ.14.17 లక్షల కోట్లుగా ఉంది. 

మరిన్ని వార్తలు