ఆ మహిళలు.. పేరుకే సర్పంచులు

25 Sep, 2023 06:30 IST|Sakshi

రాంచీ: మహిళా సాధికారత సాధనకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి.  క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం మహిళల భాగస్వామ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. జార్ఖండ్‌లో చేపట్టిన సర్వేలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో మహిళలకు సగం సీట్లు కేటాయించారు. ధన్‌బాద్‌ జిల్లాలో 95 మంది మహిళా సర్పంచులున్నారు. తమ ఫోన్‌కాల్‌కు వీరిలో 11 మంది సర్పంచులు మాత్రమే స్వయంగా స్పందించినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. మిగతా 84 మందిలో సర్పంచుల భర్తలో, మరుదులో, లేక ఆమె కుటుంబంలోని ముఖ్యులో ఆ ఫోన్‌ కాల్‌లకు స్పందించారు.

అధికారులు ఏర్పాటు చేసిన సమావేశాలకు సైతం సర్పంచులకు బదులుగా వారి భర్తలు, ఇతర కుటుంబసభ్యులే హాజరవుతున్నట్లు కూడా ఈ సర్వేలో తేలింది. బ్లాక్, సబ్‌ డివిజిన్, జిల్లా స్థాయి సర్పంచుల సమావేశాలకు హాజరై వీరు తమను ఫలానా గ్రామ సర్పంచి భర్త అనో లేక ఇతర కుటుంబ సభ్యులమనో పరిచయం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై అధికారులు ఏర్పాటు చేసే సమావేశాలకు మహిళా సర్పంచులు మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది. వారికి బదులుగా కుటుంబసభ్యులను, ఇతరులను లోపలికి రానివ్వద్దంటూ అధికారులను ఆదేశించాల్సి వచ్చింది! 

మరిన్ని వార్తలు