డెయిరీ భూముల్ని సొంత ట్రస్ట్‌కు ఎందుకు మళ్లించారు! 

2 May, 2021 03:53 IST|Sakshi
విజయవాడ సబ్‌ జైల్‌లోకి వెళ్తున్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర

ధూళిపాళ్లను ప్రశ్నించిన ఏసీబీ 

సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: సంగం డెయిరీకి చెందిన ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా సొంత ట్రస్ట్‌కు ఎందుకు మళ్లించారని సంబంధిత కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ప్రశ్నించారు. ‘రూ.కోట్ల విలువైన డెయిరీ ఆస్తులను కాజేసేందుకు పథకం ప్రకారం పోర్జరీ పత్రాలు సృష్టించింది నిజం కాదా? మీరు చేసిన అక్రమాల్లో ఎవరికి ఎటువంటి లబ్ధి కలగజేశారు? విచారణలో వాస్తవాలు చెప్పి కేసు దర్యాప్తునకు సహకరించండి’ అంటూ ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో శనివారం ఈ విచారణ సాగింది. సంగం డెయిరీ అక్రమాల కేసులో లోతైన దర్యాప్తుకోసం రిమాండ్‌లో ఉన్న ఏ1, ఏ2, ఏ3 నిందితులు ధూళిపాళ్ల, గోపాలకృష్ణన్, గురునాథంలను ఐదురోజులపాటు తమ కస్టడీకివ్వాలని ఏసీబీ కోరగా.. కోర్టు అనుమతివ్వడం తెలిసిందే. దీంతో ఏసీబీ అధికారులు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణ, గురునాథంలను కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. ముందు జాగ్రత్తచర్యగా ముగ్గురు నిందితులకు పీపీఈ కిట్లు వేసి విజయవాడ తీసుకొచ్చారు.

ఏసీబీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విచారణ నిర్వహించారు. డెయిరీభూములను ట్రస్ట్‌కు మళ్లించటం, ఫోర్జరీ పత్రాలు సృష్టి అనే కీలక అంశాలపై పలు ప్రశ్నలు సంధించారు. నిందితులు ముగ్గురూ మితంగానే బదులిచ్చినట్టు సమాచారం. నిందితుల విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ధూళిపాళ్ల నరేంద్రను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులు వచ్చారు. ఆయన్ను కలిసేందుకు అనుమతించాలంటూ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ ఏసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తొలిరోజున విచారణ అనంతరం నిందితులను విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు.

ఏసీబీ ఉత్తర్వుల అమలు నిలిపివేత..
ఇదిలా ఉంటే.. ధూళిపాళ్ల నరేంద్రతోపాటు గోపాలకృష్ణన్, గురునాథంలను ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. నరేంద్ర తదితరులను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. తమను ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నరేంద్ర తదితరులు హైకోర్టులో శనివారం హౌస్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ వేయగా.. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు