హత‘విధీ’.. ఆనందాన్ని చిదిమేసింది

22 Oct, 2023 05:18 IST|Sakshi

పుట్టిన బిడ్డను చూడకుండానే తిరిగిరాని లోకాలకు చేరిన తండ్రి 

ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బు తీసుకెళ్తుండగా ప్రమాదం 

భార్య ప్రసవించిన ఆస్పత్రిలోనే చేర్చగా దుర్మరణం

కారంపూడి: ప్రసవ వేదన పడుతున్న భార్యను ఆస్పత్రిలో చేర్చి.. ఆస్పత్రి ఖర్చులకోసం డబ్బు తీసుకుని బైక్‌పై వెళ్తున్న భర్త ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. భార్యను తరలించిన అంబులెన్స్‌లోనే అతడిని కూడా అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలు విడిచాడు. అప్పటికే భార్య ప్రసవించగా.. పుట్టిన పాపను కూడా చూసుకోకుండా ఆ తండ్రి కన్ను మూయడంతో అక్కడి వారి హృదయాలు బరువెక్కాయి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా కారంపూడి ఇందిరా నగర్‌ కాలనీ గనిగుంతలుకు చెందిన బత్తిన ఆనంద్‌ (33) భార్య రామాంజనికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో శుక్రవారం 108లో గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో మె­రు­గైన చికిత్స కోసం నర్సరావుపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె వెంట వాళ్ల అమ్మ, చిన్నమ్మ, ఆశా వర్కర్‌ ఏసమ్మ వెళ్లారు. భర్తను కూడా అంబులెన్స్‌ ఎక్కమంటే ఆస్పత్రి ఖర్చులకు డబ్బు తీసుకు వస్తానని ఆగిపోయాడు. శనివారం వేకువజామున డబ్బు తీసుకుని బైక్‌పై నర్సరావుపేట బయలుదేరాడు. మార్గమధ్యంలో జూలకల్లు అడ్డరోడ్డు వద్ద రోడ్డు పక్కన కంకర చిప్స్‌ ఉండటంతో బైక్‌ అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కాగా.. కొంతసేపటి వరకు ఎవరూ చూడకపోవడంతో చాలా రక్తం పోయింది.

ఆ తరువాత ఓ వ్యక్తి గమనించి 108కు ఫోన్‌ చేయడంతో భార్యను ఆస్పత్రి తీసుకెళ్లిన అంబులెన్సే వచ్చి అతన్ని కూడా నర్సరావుపేటలో భార్య ఉన్న ఆస్పత్రికే తీసుకెళ్లింది. అప్పటికే రక్తం ఎక్కువగా పోవడంతో ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే ఆనంద్‌ మృతి చెందాడు. అదే ఆస్పత్రి­లో ఉన్న భార్యకు సకాలంలో సరైన వైద్యం అందడంతో ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను కూ­డా చూసుకునే భాగ్యానికి నోచుకోని ఆనంద్‌ మృతి ఘటన బంధుమిత్రులను కలచి వేస్తోంది. ఇదిలా ఉంటే రామాంజనికి ఇది నాలుగో కాన్పు. ఇంతకుముందు ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు.

మరిన్ని వార్తలు