Bank Employee: ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే.. యువతి బతికేది కదా!

7 Jul, 2022 09:26 IST|Sakshi
సరస్వతి

పుత్తూరు రూరల్‌(చిత్తూరు జిల్లా): రెండేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు.. ఆరు నెలల క్రితం తల్లి కూడా కన్నుమూసింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయింది. తల్లిదండ్రులు లేరన్న బాధతో బ్యాంకు ఉద్యోగిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పుత్తూరులో బుధవారం వెలుగుచూసింది. సీఐ లక్ష్మీ నారాయణ కథనం మేరకు.. స్థానిక రెడ్డిగుంట వీధిలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో క్లర్క్‌గా పనిచేస్తున్న వి.సరస్వతి(38), తన అన్న సుబ్రమణ్యంతో కలిసి నివసిస్తోంది. వీరిరువురూ అవివాహితులే. తండ్రి గోవిందస్వామి విశ్రాంత అటవీ ఉద్యోగి.
చదవండి: తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి..

రెండేళ్ల క్రితం తండ్రి, జనవరిలో తల్లి కృష్ణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగేళ్లుగా తల్లిదండ్రులను కాపాడుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరిగి, చివరకు వారిని కోల్పోవడంతో మానసికంగా సరస్వతి కుంగిపోయింది. అన్న సుబ్రమణ్యం మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ కూడా ఇప్పించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సరస్వతి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

బుధవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి పిన్నమ్మ ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నన్ను ఒంటరిని చేసి అమ్మనాన్నలతో పాటు వెళ్లిపోయావా చెల్లీ.. అంటూ అన్న సుబ్రమణ్యం ఆక్రందన అందరిని కలిచివేసింది. 

ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే..! 
ఈ పాడుబడిన బావిని పూడ్చేసే సమయంలో టీడీపీ నాయకులు అడ్డురాకుండా ఉండివుంటే యువతి బతికేది కదా అంటూ స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి ఆత్మహత్య చేసుకున్న బావి రెండు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంటూ దుర్వాసన వెదజల్లుతోంది. స్థానికుల కోరిక మేరకు 24వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ కె.ఏకాంబరం ఈ ఏడాది జనవరిలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డికి బావిని పూడ్చివేయాల్సిందిగా వినతిపత్రం అందించారు. స్పందించిన కమిషనర్‌ జనవరి 31వ తేదీ సిబ్బందితో బావిని పూడ్చివేసేందుకు ఉపక్రమించారు.

అదే సమయంలో టీడీపీకి చెందిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యుగంధర్‌ తన అనుచరులతో వచ్చి బావిని పూడ్చేందుకు వీలులేదంటూ అడ్డుకున్నారు. విధులకు అడ్డుతగలడమే కాకుండా దుర్భాషలాడారని కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుండా ఉంటే యువతి చావుకు ఆ బావి సాక్షి భూతంగా నిలిచేది కాదని మహిళలు వాపోయారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు