తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని.. పక్కా ప్లాన్‌తో ఫోన్‌ చేయించి.. ఫొటోలు, వీడియోలు తీసి

5 Feb, 2022 10:54 IST|Sakshi

ప్రేమ నెపంతో యువకుడిపై విచక్షణారహితంగా దాడి

ఆలస్యంగా వెలుగులోకి ఘటన ఇరువర్గాలపై కేసు నమోదు 

కాజీపేట: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని పక్కా ప్లాన్‌తో ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కాజీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి తండ్రి, యువతి బంధువులు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేయడంతో ఇరువర్గాలపై కేసు నమోదైంది. బాధితుడి తండ్రి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.

హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బైరపాక ప్రభుదాస్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ డీజిల్‌ కాలనీలో కుటుంబంతో అద్దెకు ఉండేవాడు. ఆయన కుమారుడు ప్రసాద్‌ ఇంటి యజమాని కూతురుతో ప్రేమగా ఉంటున్నాడనే అనుమానంతో గొడవలు జరిగాయి. దీంతో ప్రభుదాస్‌ కుటుంబం దూరంగా వేరే ఇంటికి మారింది. ఈ క్రమంలో బుధవారం అమ్మాయితో బంధువులు ప్రసాద్‌కు ఫోన్‌ చేయించి ఇంటికి పిలిపించారు. ఇంట్లోకి తీసుకెళ్లి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేస్తూ ఫొటోలు, వీడియోలు తీసి ప్రసాద్‌ మిత్రులకు పంపించడంతో విషయం వెలుగు చూసింది.
(చదవండి: టోనీ వ్యవహారంలో మనీల్యాండరింగ్‌)

బాధితుడి తండ్రి బంధువులు, మిత్రులతో వెళ్లి ప్రసాద్‌ను విడిచిపెట్టాలని వేడుకోగా మరోమారు అమ్మాయి జోలికి రావొద్దని రాయించుకుని వదిలేశారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా యువకుడితో పాటు అతడి కుటుంబసభ్యులపై అమ్మాయిని వేధిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ గట్ల మహేందర్‌రెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరితోపాటు యువకుడిని చితకబాదిన మాచర్ల శేఖర్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. 
(చదవండి: పెళ్లి చేసుకుంటానని.. పలుమార్లు లైంగికదాడి చేసి మోసం..)

మరిన్ని వార్తలు