ప్రేమ వ్యవహారం: రాయబారానికి పిలిచి హతమార్చారు!

26 Jun, 2021 08:36 IST|Sakshi
రామారావు (ఫైల్‌)

దుర్గా అగ్రహారంలో వ్యక్తి దారుణ హత్య 

ప్రేమ వ్యవహారానికి మధ్యవర్తిత్వం చేసినందుకు..

గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): ప్రేమ వ్యవహారంలో పెద్దగా వ్యవహరించిన వ్యక్తిని పట్ట పగలు దారుణంగా చంపిన ఘటన సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దుర్గా అగ్రహారంలో శుక్రవారం చోటు చేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం... కండ్రికకు చెందిన ఓ మైనర్‌ బాలికను పవన్‌ అనే యువకుడు ప్రేమించాడు. బాలిక బాబాయ్‌ మురళీకి ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో పవన్‌కు వార్నింగ్‌ ఇవ్వాలని కుక్కల రవి అనే వ్యక్తిని ఆశ్రయించాడు. పదిహేను రోజుల క్రితం బాలిక బాబాయ్‌ మురళీ, రవి, లక్కీ, అశోక్‌ నలుగురు కలిసి మాట్లాడుకుందాం రావాలంటూ పవన్‌ను పిలిపించి వార్నింగ్‌ ఇచ్చారు.

ఆ సమయంలో పవన్‌ కండ్రికకు చెందిన ఆలమూరి రామారావుకు జరిగిన విషయం చెప్పడంతో ఆయన అక్కడకు వెళ్లి  వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.   ఆ సమయంలో లక్కీ అనే వ్యక్తి గంజాయి మత్తులో రామారావు పై దౌర్జన్యానికి దిగాడు. విషయం తెలుసుకున్న స్థానికులు రామారావుకు మద్దతుగా వచ్చి లక్కీపై దాడి చేశారు. ఆ సమయంలో పరస్పరం చాలెంజ్‌ చేస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయారు. అదే సమయంలో అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు వచ్చి అందరినీ చెదరగొట్టారు.

పోలీసులు గొడవను అంత సీరియస్‌గా తీసుకోలేదు. గొడవను మనసులో పెట్టుకుని అప్పటినుంచి ఆ నలుగురు రామారావుపై కక్ష తీర్చుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చారు.. ప్లాన్‌ ప్రకారం ప్రేమ వ్యవహారం మాట్లాడుకుందాం రావాలంటూ రామారావును దుర్గా అగ్రహారానికి పిలిచి చివరకు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో రామారావు అక్కడికక్కడే మృతి చెందారు. 

వలంటీర్‌ సమాచారం 
దుర్గా అగ్రహారంలో మధ్యాహ్నం 1.40 నిమిషాలకు రామారావు హత్య జరిగింది. ఘటన జరిగిన వెంటనే సమాచారం తెలుసుకున్న వార్డు వలంటీర్‌ మహిళా సంరక్షణ పోలీస్‌కు సమాచారం చేరవేశారు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిమిషాల వ్యవధిలో ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు, సీఐ సూర్యనారాయణ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. నిందితుల్లో రవిపై సూర్యారావు పోలీస్‌ స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉన్నట్లు సమాచారం. 

చదవండి: దారుణం: కాళ్లు చేతులు కట్టేసి.. నోట్లో చీర కొంగు కుక్కి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు