ఈ ఆయుర్వేదిక్‌ మందు వాడితే పిల్లలు చురుకుగా ఉంటారని చెప్పి..

22 Dec, 2021 14:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమీర్‌పేట: తాను తయారు చేసిన ఆయుర్వేదిక్‌ మందు వాడితే పిల్లలు చురుకుగా ఉంటారని డబ్బులు కాజేసిన వ్యక్తులపై కేసు నమోదైన ఘటన ఎస్‌ఆర్‌నగర్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరాల ప్రకారం.. నిజాంపేట బృందావనం కాలనీలో నివసించే ఉమారెడ్డి శ్రీకాంత్‌రెడ్డికి మూడు నెలల క్రితం ఓ వ్యక్తి తనకు తానే పరిచయమై తన పేరు గురప్ప అని, మీ అమ్మాయికి కంటి చూపు సరిగా లేదు కాదా అని అడిగాడు. అదేం లేదు.. కానీ.. వేరే పిల్లలాగా హుషారుగా ఉండటం లేదని శ్రీకాంత్‌ తెలిపాడు. మా అన్న కూతురు కూడా ఇలాగే ఉండేదని ఆయుర్వేదిక్‌ మందులు వాడితే తగ్గిందని కాసేపు మాట్లాడి శ్రీకాంత్‌ ఫోన్‌ నెంబర్‌కు తీసుకుని వెళ్లిపోయాడు.
చదవండి: క్రికెట్‌ టోర్నీలో చాన్స్‌ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్‌ను..

మరుసటి రోజు దుర్గప్ప అనే వ్యక్తి ఫోన్‌ చేసి గురప్ప మీ నెంబర్‌ ఇచ్చాడని, తాను మందు తయారు చేసిస్తానని శ్రీకాంత్‌ వద్దకు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ దుకాణానికి వెళ్లి అక్కడున్న హజ్‌రత్, రాకేష్‌లకు మందు తయారు చేసి ఇవ్వాలని గురప్ప సూచించాడు. పలు రకాల ఆయుర్వేదిక్‌ పదార్థాలు కలిపి తయారు చేసిన ఓ మందును శ్రీకాంత్‌ చేతికిచ్చి రూ.1.81 లక్షలు తీసుకున్నారు. రెండు నెలలుగా మందు వాడుతున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
చదవండి: MBS Jewellers: నిజాం నగల పెట్టెలు.. విడిపించాక పంచుకుందాం 

మరిన్ని వార్తలు