వరల్డ్‌కప్‌ ఫైనల్ చూస్తుండగా టీవీ ఆపేసిన కొడుకు.. ఛార్జర్ కేబుల్‌తో ఉరేసిన తండ్రి

22 Nov, 2023 16:25 IST|Sakshi

భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాాచ్‌ను యావత్‌ క్రికెట్ అభిమానులంతా ఆసక్తికరంగా వీక్షించారు. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజ్‌ పోరును, టీవీ, హాట్‌స్టార్‌, పలుచోట్ల భారీ స్క్రీన్ల ద్వారా ఉత్కంఠగా చూశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫైనల్ ఫీవర్ దేశం మొత్తాన్ని ఊపేసింది.

అయితే వరల్డ్‌ కప్‌ తుది పోరు ఓ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. ఇంట్లో టీవీ చూస్తున్న ఓ తండ్రి.. మ్యాచ్ మధ్యలో టీవీ ఆపేశాడన్న కోపంతో కన్న కొడుకుతో వాగ్వాదానికిదిగాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ఆవేశంలో కొడుకును హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం వెలుగుచూసింది,.  

వివరాలు.. కాన్పూర్‌కు చెందిన గణేష్‌ ప్రసాద్ అనే వ్యక్తి ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ సమయంలో అతడి కుమారుడు దీపక్.. తనకు ఆకలిగా ఉండటంతో  త్వరగా వంట చేయాలని కోరాడు. తన మాటలను తండ్రి పట్టించుకోకుండా మ్యాచ్‌లో లీనమైపోవడంతో దీపక్ టీవీని ఆఫ్ చేశాడు. దీంతో గణేష్‌ ప్రసాద్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి కొడుకుతో గొడవపడ్డాడు. ఇది ఇద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది.
చదవండి: అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి!

అప్పటికే మద్యం మత్తులో ఉన్న గణేష్‌ ప్రసాద్.. పక్కనే ఉన్న మొబైల్ ఛార్జర్ కేబుల్‌తో కొడుకును ఉరేసి చంపాండు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. మెట్లపై దీపక్ మృతదేహాన్ని పడి ఉండటాన్ని గుర్తించిన వారి బంధువు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై కాన్పూర్ ఏసీపీ బ్రిజ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమైందని వెల్లడించారు. నిందితుడు హత్యకు మొబైల్ ఛార్జర్‌ కేబుల్‌ను ఉపయోగించాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారని చెప్పారు. తండ్రీ కొడుకులిద్దరూ తరుచూ మద్యం సేవించి గొడవ పడుతుంటారని తెలిసినట్లు పేర్కొన్నారు. ఇటీవల దీపక్ తన తల్లిని కొట్టాడంతో గతవారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు.

మరిన్ని వార్తలు