Uttar Pradesh Crime: సంచలనం రేపిన యువతి హత్య: కేసు వెనక్కి తీసుకోలేదని వెంటాడి.. వేటాడి ..!

21 Nov, 2023 16:00 IST|Sakshi

లక్నో: కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిందన్న అక్కసుతో అత్యాచార బాధితురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం  రేపింది. మూడేళ్ల క్రితం  మైనర్‌ బాలికపై (ఇపుడు 19ఏళ్ల యువతి)  లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటాడి మరీ గొడ్డలితో నరికి చంపిన ఈ దారుణ ఘటన  ఉత్తర్​ ప్రదేశ్​ కౌషంబి జిల్లాలోని  దేర్హా గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం మూడేళ్ల క్రితం మైనర్‌ బాలికపై తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన కేసులో  పవన్‌ ​ నిందితుడు.  బాధితురాలి (ఇపుడు హత్యకు గురైన) యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. అయితే అప్పటినుంచి కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా బాధిత కుటుంబాన్ని, యువతిని వేధిస్తూనే ఉన్నాడు.దీనికి  వారు ససేమిరా అనడంతో మరింత కక్ష పెంచుకున్నాడు. రెండు రోజుల క్రితం బెయిల్‌పై వ చ్చిన పవన్‌ ఎలాగైనా ఆమెను హత మార్చాలని పథకం వేశాడు.  

సరిగ్గా ఇదే సమయానికి మరో హత్య కేసులో నిందితుడిగా  జైలుకెళ్లిన అతని సోదరుడు అశోక్​ నిషాద్​ కూడా బయటి కొచ్చాడు. దీంతో  ఇద్దరూ కలిసి వారిని  బెదిరించి, కేసు క్లోజ్ చేయాలని ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో  పథకం ప్రకారం బాధిత యువతి పశువులను మేతకు తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా, ఆమెపై దాడి చేశారు. అతి దారుణంగా వెంటాడి,  వేటాడి గొడ్డలితో నరికి చంపేశారు. దీంతో స్థానికులు సైతం భయాందోళనకు లోనయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలీసులు  యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు నిందితులను అరెస్టుకు  బృందాలను ఏర్పాటు చేశామని కౌశాంబి  ఎస్పీ బ్రిజేష్ శ్రీవాస్తవ  తెలిపారు.

యూపీలో నేరస్థులు రెచ్చిపోతున్నారని, వారికి ఎలాంటి చట్టాల పట్ల భయంగానీ, గౌరవంగానీ  లేదంటూ యూపీ కాంగ్రెస్‌ మండిపడింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ  చీకటి నగరానికి వెలుగెన్నడు ఇంతట అధ్వాన్న స్థితిలో ఆడపిల్లలు స్వేచ్ఛా వాయువులు ఎపుడు  పీల్చుకో గలుగుతారు? అంటూ  అందోళన వ్యక్తం చేసింది. 

ఇది ఇలా  ఉంటే  ఈ ఘటన యూపీలో మహిళలు, యువతుల భద్రతను మరోసారి చర్చకు తెచ్చింది. ఆడబిడ్డలకు రక్షణలేకుండాపోయిందని  కాంగ్రెస్‌ మండిపింది.  మహిళలను వేధించిన వారిపై  యమ్‌రాజ్ ఖచ్చితమైన ప్రతీకారం తీర్చుకుంటాడని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరిక జారీ చేసిన రెండు నెలల తర్వాత ఈ దారుణం చోటు చేసుకుంది. ఎన్‌సీఆర్‌బీ డేటా 2021  ప్రకారం యూపీలో మహిళలపై 56వేలకు పైగా నేరాలు నమోదు కాగా,  వీటిల్లో అత్యాచారం, మర్డర్​, యాసిడ్​ దాడులు ఎక్కువగా  ఉండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు