అంబానీకి బెదిరింపుల కేసులో ఇద్దరి అరెస్ట్‌

5 Nov, 2023 05:53 IST|Sakshi

ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ సంస్థ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన వ్యవహారంలో తెలంగాణ, గుజరాత్‌లకు చెందిన ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఎనిమిది రోజుల వ్యవధిలో అంబానీకి చెందిన సంస్థకు మూడు ఈమెయిళ్లు అందాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ మొదటి మెయిల్‌ పంపారు. తమ వద్ద మంచి షూటర్లు ఉన్నట్లు అందులో బెదిరించారు. ఆతర్వాత మరో మెయిల్‌లో రూ.200 కోట్లు ఇవ్వాలని బెదిరించారు.

సోమవారం పంపిన మెయిల్‌లో రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ఉంది. వీటిపై అంబానీ భద్రతా అధికారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు తెలంగాణలోని వరంగల్‌కు చెందిన గణేశ్‌ రమేశ్‌ వనపర్తి(19) కాగా, మరొకరు గుజరాత్‌కు చెందిన షాదాబ్‌ ఖాన్‌(21). శనివారం గణేశ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 8వ తేదీ వరకు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. షాదాబ్‌ ఖాన్‌ ఉన్నతవిద్యా వంతుడని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు